సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసంతో దేశం ఉలిక్కిపడిందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు. ఈ సందర్భంగా శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు. సైనికుల నియమకాలలో ‘‘అగ్నిపథ్’’ పేరుతో నాలుగేళ్లు సర్వీస్ పెట్టడం దారుణమని అన్నారు. నాలుగేళ్ల తర్వాత వారి జీవితాలకు ఎలాంటి భరోసా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అగ్నిపథ్ తో నేడు దేశాన్ని అగ్ని గుండంలా మార్చారని మండిపడ్డారు. గతంలో 15 నుంచి 20 సంవత్సరాల సర్వీస్ తో పాటు.. అన్ని సౌకర్యాలు ఇచ్చేవారని గుర్తు చేశారు వీహెచ్. సైనికులకు పెన్షన్లు ఇవ్వాల్సి వస్తుందనే.. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించారని వ్యాఖ్యానించారు.
మహమ్మద్ ప్రవక్త పైన బీజేపీ నాయకులు చేసిన ప్రకటనలతో ప్రపంచం ముందు భారత్ పరువు పోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రతిష్టను మంట గలుపుతున్నారని విరుచుకుపడ్డారు.
దేశం కోసం ప్రాణాలర్పించేందుకు సిద్ధపడ్డ వారికి బీజేపీ ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు వీహెచ్. డిఫెన్స్ దగ్గర నిధులు లేవంటే ప్రపంచం ముందు దేశం పరువు ఏమి కావాలని నిలదీశారు. దేశాన్ని పాలించే సత్తా లేకపోతే పక్కకు తప్పుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.