బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలనుద్దేశించి సెటైర్లు వేశారు కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణలోనే సరిగ్గా తిరగలేనోడు.. ఇప్పుడు దేశం మొత్తం తిరుగుతా అంటున్నారని కేసీఆర్ ని ఉద్దేశించి మాట్లాడుతూ ఎద్దేవా చేశారు వీహెచ్. నరేంద్ర మోడీని కొట్టాలంటే సెక్యులర్ పార్టీలన్నీ ఏకతాటిపైకి
రావాలన్నారు. అది బీజేపీ.. ఇది భారత్ రాష్ట్ర సమితి అంటే.. అది ఏ టీం.. ఇది బీ టీం అని అని ఆయన సెటైర్ వేశారు.
సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే తమ పరిస్థితి ఏంటని? ప్రశ్నించారు వీహెచ్. 1969లో పోలీసు తూటాలకు చనిపోయిన వారి గుర్తించి ఎప్పుడైనా ఆలోచించారా అంటూ నిలదీశారు. పబ్లిసిటీ కోసమే కొత్త పార్టీ అన్నారు. రాష్ట్రంలో ఏమీ చేయలేని కేసీఆర్ దేశంలో ఏదో చేస్తానంటే ఎవరు నమ్ముతారన్నారు. కేసీఆర్ వ్యక్తి గత రాజకీయ లబ్ధి కోసమే జాతీయ పార్టీ అంటూ ఆరోపించారు. కేసీఆర్ రాష్ట్రంలో సంపాదించిన సొమ్మును దేశంలో ఖర్చు చేస్తారని ఆయన వ్యాఖ్యానించారు.
అలాగే రాహుల్ గాంధీ పాద యాత్ర గురించి వీహెచ్ మాట్లాడుతూ.. ఆయన అతి ధైర్యం, పట్టుదలతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 3500 కిలో మీటర్లు జోడో యాత్ర చేస్తున్నారని కొనియాడారు. రాహుల్ కు రెండు సార్లు ప్రధాని మంత్రిగా అవకాశం వచ్చినా ఆర్థిక వేత్తకు అవకాశం ఇచ్చారే తప్ప.. తను ఆశపడలేదన్నారు.
సోనియా గాంధీ ఆరోగ్యం బాగోక పోయినా, కొడుకు దగ్గరకు వెళ్లి పాదయాత్రలో పాల్గొన్నారని తెలిపారు. సోనియా ఆరోగ్యరీత్యా మంచిది కాదని రాహుల్ చెప్పినా కూడా ఆమె లెక్క చేయకుండా ఈ యాత్రలో పాల్గొన్నారన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఫ్యామిలీ కూడా జోడో చేసుకోవాలని, ప్రజల గురించి ఆలోచించాలన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంత రావు.