నాగార్జున యూనివర్సిటీలో వివాదస్పద వ్యాఖ్యలు చేసిన ఆర్జీవీ మీద ప్రముఖులు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే పీసీసీ మాజీ అధ్యక్షుడు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు తీవ్రంగా మండిపడ్డారు. అసలు వర్మకు సెన్స్ ఉందా అని ప్రశ్నించారు.
గురువారం ఆయన నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మహిళలు అంటే కనీసం గౌరవం లేకుండా కేవలం మహిళలు శృంగారం, తిండికి మాత్రమే అవసరం అవుతారన్నట్లుగా ఆర్జీవీ చేసిన వ్యాఖ్యల పై తీవ్రంగా మండిపడ్డారు.
మహిళలు అంటే అంత చిన్న చూపు ఎందుకని ఆయన ప్రశ్నించారు. ప్రపంచంలో మగ జాతి అంతా నశించిపోయి తాను ఒక్కడినే ఉంటానని చెప్పడం, మహిళలందరికీ అప్పుడు నేనే దిక్కు అన్నట్లుగా వ్యాఖ్యానించడం పై వీహెచ్ తీవ్రంగా విరుచుపడ్డారు. వెంటనే ఆయన మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని లేదంటే దేశవ్యాప్తంగా ఉద్యమం మొదలవుతుందని హెచ్చరించారు.
దేశవ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాలు స్పందించాలని వర్మ వ్యాఖ్యలను పోలీసులు సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయాలని వీహెచ్ డిమాండ్ చేశారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని రాజకీయ రంగంలోనూ వారికి పెద్దపీట వేయాలన్న ఆలోచనతో రాజీవ్ గాంధీ స్థానిక సంస్థల్లో 33 శాతం మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని గుర్తు చేశారు.