జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తెలంగాణలో జరుగుతున్న హుజుర్‌నగర్ ఉపఎన్నికలో ఎవరి పక్షం వైపు నిలుస్తాడు..? ఏపీలో మొన్నటి ఎన్నికల్లో ఆయనతో కలిసి పనిచేసిన కమ్యూనిస్టుల్లో సీపీఐ సిద్దాంతాలు పక్కన పెట్టేసి అధికార పక్షం వైపు నిలిచింది. ఇక, సీపీఎం మద్దతు కోసం టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. మరి జనసేనాని ఎవరికి సపోర్టు చేస్తాడు..?
హుజూర్‌నగర్ శాసనసభా నియోజకవర్గంలో చెప్పుకోతగ్గ కాపు సామాజిక వర్గపు ఓట్లు కూడా వున్నాయి. ఎప్పుడూ లేనంతగా తెలంగాణా సమాజంలో కులాల ప్రాతిపదికగా జరుగుతున్న ఉపఎన్నిక ఇది. ఆ పుణ్యం కాస్తా అధికార పార్టీదే. సీపీఐ మద్ధతు కోరిందే దానికోసం. రెండు రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతమైన హుజూర్‌నగర్‌లో కమ్మ సామాజిక ప్రాబల్యం కూడా బలంగానే వుంది. ఈ ఓట్లు తెలుగుదేశం చీల్చుకోకుండా సీపీఐలో వున్న ఆ సామాజిక వర్గ నేతల ద్వారా రాబట్టుకోవాలన్న ఆలోచనే అధికార పక్షంలో వున్నవారిది. పోరాటాల జిల్లాగా వున్న నల్లగొండలో కమ్యూనిస్టులకు కాస్తో కూస్తో పట్టు వున్న ప్రాంతం కూడా కావడంతో ఆ ఓట్లన్నీ గంపగుత్తగా తమకే పడతాయనే దూరాలోచన పాలక పక్షంలో కనిపిస్తోంది. అదీగాకుండా ఎన్నికల ఇంఛార్జీల నియామకంలో కూడా అధికార పార్టీ కులాల సమీకరణాల్ని ఫాలో అయ్యిందని వార్తలు వచ్చాయి. దానివల్లే ఈసారి ఇక్కడ ఎన్నికల్లో కుల ప్రభావం బాగా పెరిగిందని అనుకోవాలి.
ఇలావుంటే, జనసేనానితో మొన్నటి ఎన్నికల్లో కలిసి పనిచేసిన కమ్యూనిస్టులు ఇప్పుడు చెరోదారి చూసుకున్నారు. సీపీఐ అధికార పార్టీకి మద్దతు ఇస్తోంది. దీనిపై పార్టీ స్థానిక శ్రేణులు ఎంత వ్యతిరేకంగా వున్నా ఆ పార్టీ నాయకత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. జనసేనాని మొన్నటి తన మిత్రపక్షం సీపీఐతో ఇప్పుడు కలిసి పనిచేసే పరిస్థితి ఎటూ లేదు. ఎందుకంటే టీఆర్ఎస్‌కు జనసేన మద్దతు ఇవ్వడం జరిగే పని కాదు.
ఇక అందరూ అంచనా వేస్తున్నది జనసేన ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తుందని. ఇటీవలి కాలంలో రెండు రంగాల్లోని ఇద్దరు సూపర్‌స్టార్లు అటు రేవంత్, ఇటు పవన్‌కల్యాణ్ ఒకే వేదిక పంచుకుని యురేనియం తవ్వకాలపై పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇటీవలి కాలంలో అది ఒక అనూహ్యమైన పరిణామం. తెలంగాణలో రేవంత్ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీకి పవన్‌కల్యాణ్ సపోర్టు వుంటుందని అందరూ అంచనావేశారు.
ఐతే, వీటన్నింటి కంటే ముందు పవన్‌కల్యాణ్‌ని కలిసిన నేత వీహెచ్. యురేనియంపై పోరాటానికి కాంగ్రెస్ నియమించిన కమిటీకి వీహెచ్ సారధిగా వున్నారు. యురేనియంపై పోరాటానికి కలిసి రావాలని వీహెచ్ వెళ్లి జనసేనానిని కోరడం, దానికి పవర్‌స్టార్ అంగీకరించడంతో తెలంగాణ పాలిటిక్స్‌లో చిన్నగా ఒక కుదుపు మొదలయ్యింది. ఇది ఎంత కుదుపు అంటే కేటీఆర్ వెంటనే తనకు అనుకూలురైన సినీ స్టార్లని ప్రోత్సహించి వారితో యురేనియంపై పోరాటానికి మద్ధతు ఇవ్వండని సోషల్ మీడియాలో పిలుపునిచ్చేంతటి కుదుపు. పవన్‌కల్యాణ్‌కు చెక్ చెప్పడానికే ఇతర స్టార్లతో కేటీఆర్ తెరవెనుక కథ నడిపించారని అప్పట్లో టాక్ !
ఇంతకీ ఇప్పుడు గంట కట్టేది ఎవరు.? ఇంకెవరు..? వీహెచ్.
వీహెచ్ అంటే పవన్‌కల్యాణ్ చాలా బాగా అభిమానిస్తారు. అంతకు మించి గౌరవిస్తారు. ఆ గౌరవం కొద్దే వీహెచ్‌ను జనసేనలో వచ్చి జాయిన్ అవ్వాలని కోరడం. ఈ ఆఫర్‌ను వీహెచ్ సున్నితంగా తిరస్కరించారని కూడా చెప్పారంటారు. ఇప్పుడు వీహెచ్ వెళ్లి పవన్‌కల్యాణ్‌ని కలిసివచ్చారు. హుజుర్‌నగర్ ఎన్నికలో తమ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరివచ్చారు. దానికి పవన్‌కల్యాణ్ ఏం రిప్లయ్ ఇచ్చారో ఇప్పటికిప్పుడు తెలియదు కానీ, రెండు మూడు రోజుల్లోనే జనసేనాని వైఖరి బయటపడచ్చు..