రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ భగ్గుమంటోంది. సీఎంకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. శనివారం అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసిన హస్తం నేతలు.. ఆదివారం అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకాలు చేశారు.
రాజ్యాంగాన్ని అవమానించేలా కేసీఆర్ మాట్లాడడం దిగజారుడుతనానికి నిదర్శనమని కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీత మండిపడ్డారు. కాంగ్రెస్ ఇంఛార్జ్ బొల్లు కిషన్ ఆధ్వర్యంలో కంటోన్మెంట్ లోని కార్ఖానా దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను కేసీఆర్ అవమానించారని అన్నారు సునీత. వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ వ్యవస్థను కించపరిచేలా కేసీఆర్ సూచనలు చేయడం సిగ్గుచేటన్నారు.
కేసీఆర్ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని.. లేనిపక్షంలో తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు సునీత. కేసీఆర్ మత్తులో ఉండి మాట్లాడడం మానుకోవాలని ఎద్దేవ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.