అవమానాలు తట్టుకేలేకపోతున్నా.. పార్టీని వీడుతున్నా అంటూ అధిష్టానానికి లేఖ రాసిన ఎమ్మెల్యే జగ్గారెడ్డిని బుజ్జగించే పనిలో ఉన్నారు సీనియర్ నేతలు. రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ ట్విట్టర్ లో స్పందిస్తూ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అధ్యక్షుని అభిప్రాయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నాను.. ఎవరూ మీడియాలో మాట్లాడవద్దు.. అలాగే ఏఐసీసీపై కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు.. మనం చేతులు కలిపితేనే 2023లో తెలంగాణలో కాంగ్రెస్ ను విజయతీరాలకు చేర్చగలం అని పోస్ట్ చేశారు.
తనను అవమానిస్తున్నారని అధిష్టానానికి లేఖ పంపిన జగ్గారెడ్డి.. పార్టీని ఎందుకు వీడాల్సి వచ్చిందో వివరిస్తూ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. శనివారమే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని.. కానీ.. మూడు నాలుగు రోజులు టైం తీసుకొని ఆలోచించుకోమని సీనియర్లు చెప్పారన్నారు. అందుకే ఆగానన్న ఆయన.. సమయం తీసుకున్నా రాజీనామాపై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. జగ్గారెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలోనే మాణిక్కం ఠాకూర్ అలా కామెంట్ చేశారని చెబుతున్నారు.
ఇటు పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. జగ్గారెడ్డి సహా మాజీ మంత్రి గీతారెడ్డి హాజరయ్యారు. జగ్గారెడ్డిని దగ్గరుండి ఉత్తమ్ ఇంటికి తీసుకెళ్లారు మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్. జగ్గారెడ్డి పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఏవైనా సమస్యలుంటే ఢిల్లీలో తేల్చుకుందామని.. పార్టీని వీడొద్దని బుజ్జగించారు నేతలు.
రాహుల్ గాంధీని కలిసి జరుగుతున్న వ్యవహారాలను, తనకు జరిగిన అవమానాలను వివరించాలని జగ్గారెడ్డికి సూచించారు ఉత్తమ్. పార్టీని వీడతానని తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పారు.