రాష్ట్రవ్యాప్తంగా పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఎస్పీ కార్యాలయాలు, కమిషనరేట్ల ముందు ధర్నాలకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్యనేతలను ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. అసోం సీఎంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు రాష్ట్రవ్యాప్తంగా 700పైగా పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదు చేశారు.
ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బుధవారం ధర్నాలు చేపట్టనున్నట్టు ఇంతకు ముందే ప్రకటించారు రేవంత్ రెడ్డి.
అందుకు ప్రతిగా పోలీసులు గృహనిర్బంధాలు మొదలు పెట్టారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో రేవంత్ రెడ్డి ఇంటిని పోలీసులు చుట్టాముట్టారు. ఇంటివద్ద భారీగా పోలీసులను మోహరించి.. ధర్నాకు వెళ్లకుండా అడ్డుకున్నారు. బయటకు రాకుండా ఇంటి చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు.
భట్టి విక్రమార్క, ఎంపీ కోమటిరెడ్డిని ఇంట్లోంచి బయటకు రాకుండా గృహనిర్బంధం చేశారు. నిజామాబాద్ లో మధుయాష్కిని, కామారెడ్డికి వెళ్లకుండా షబ్బీర్ అలీని అడ్డుకున్నారు. మరోవైపు గృహ నిర్బంధంలో ఉన్న రేవంత్ రెడ్డిని కలిసేందుకు వెళ్లిన కొందరు నేతలను పోలీసులు అడ్డుకున్నారు.
రేవంత్ ఇంటి ముందే టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్, కాంగ్రెస్ ఎస్సీ విభాగం రాష్ట్ర కన్వీనర్ గడ్డం శ్రీనివాస్ తో పాటు.. ఇతర కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసి బంజారా హిల్స్ పోలీస్టేషన్ కి తరలించారు పోలీసులు. దేశంలో మోడీ, రాష్రం రలో కేసీఆర్ ల రాచరికపు పాలన ఇంకా ఎంతో కాలం సాగదన్నారు కాంగ్రెస్ నేతలు.