ఈమధ్య మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడకు వెళ్లినా ప్రజలు చుక్కలు చూపిస్తున్నారు. ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారని నిలదీస్తున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్ కు చేదు అనుభవం ఎదురైంది. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కొందరు యువకులు మంత్రి కాన్వాయ్ ను అడ్డుకునేందుకు యత్నించారు. కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. వారిని అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు. మినీ స్టేడియం, డిగ్రీ కాలేజీ, 30 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తానని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కేటీఆర్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు యువకులు.
ఈనెల 11న ఖమ్మం పర్యటనలోనూ ఇలాగే జరిగింది. పీడీఎస్యూ విద్యార్ధి సంఘ నాయకులు కేటీఆర్ కాన్వాయ్ ను అడ్డుకునేందుకు చూశారు. నిరసనకారులను బలవంతంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు.. నిరసనకారులను పోలీసు స్టేషన్ కు తరలించారు.
అంతకుముందు రోజు.. జగిత్యాల జిల్లా మెట్ పల్లి వెళ్లిన కేటీఆర్ కు నిరసన సెగ తగిలింది. ఆయన కాన్వాయ్ పైకి ఓ రైతు చెప్పు విసిరేందుకు చూశాడు. పోలీసులు అతడిని అడ్డుకున్నారు. కేటీఆర్ ఏ జిల్లాకు వెళ్లినా ముందస్తు అరెస్టులు కొనసాగుతుంటాయి. అయినా కూడా ప్రతిపక్ష నేతలు, విద్యార్థి నాయకులు, రైతులు.. ఇలా ఎవరో ఒకరు తమ నిరసనను వ్యక్తం చేస్తూనే ఉంటున్నారు.