కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఇక భారీ స్థాయిలో ఆందోళనకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఈనెల 24న రాష్ట్రపతి భవన్ ముట్టడికి ఆ పార్టీ పిలుపునిచ్చింది. ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో రాష్ట్రపతి భవన్ ముట్టడి కార్యక్రమం జరుగనుంది. ఈ ఆందోళనకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.
మరోవైపు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రెండు కోట్ల మంది రైతుల సంతకాలు సేకరించాలని కూడా కాంగ్రెస్ నిర్ణయించింది. సంతకాల సేకరణ జాబితాను రాష్ట్రపతికి అందివ్వాలని భావిస్తోంది.అప్పటికీ కేంద్రం ఏ నిర్ణయమూ తీసుకోకపోతే ఆందోళనను మరింత తీవ్రతరం చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది.