తెలంగాణలో కాంగ్రెస్ అంటేనే గ్రూప్ రాజకీయాలకు పెట్టింది పేరు. తాము ఎదగకపోయిన పరవాలేదు కానీ… తమతో ఉన్నవారికి పదవి వస్తుందంటే మాత్రం అస్సలు తట్టుకోలేరు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. తెలంగాణ పీసీసీ చీఫ్ రేసులో ఉన్న ముఖ్య నేత.. అప్పుడే పదవి కోసం చీప్ ట్రిక్స్ మొదలుపెట్టినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జీ మణికం ఠాగూర్ రాష్ట్ర నేతల అభిప్రాయాలను తెలుసుకుంటున్న సమయంలో.. తనదైన స్ట్రాటజీకి ఆ లీడర్ తెరతీసినట్టుగా తెలుస్తోంది.
పీసీసీ చీఫ్ ఎంపికలో డీసీసీల అభిప్రాయం కూడా కీలకమైనది కావడంతో… వారిందరికి ఆ ముఖ్య నేత బంపర్ ఆఫర్ ఇచ్చారని టాక్ వినిపిస్తోంది. రాష్ట్రంలో బీజేపీ బలపడుతున్న దృష్ట్యా..రానున్న రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసి పనిచేసే అవకాశముందని వారికి వివరిస్తూ…తనను బలపరిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు డీసీసీలుగా ఉన్నవారందరికీ టికెట్లు ఇప్పించే బాధ్యత తానే తీసుకుంటానని హామీ ఇస్తున్నారట. తాను పీసీసీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే.. మద్దతు ఇచ్చినవారందరికీ తగిన ప్రతిఫలం అందిస్తానంటూ డీసీసీలను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా కొందరు నేతలు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే ఈ ఆఫర్ అందుకున్న కొందరు డీసీసీలు.. ఆ లీడర్ వ్యవహారాన్ని ఇప్పటికే ఇంచార్జ్ మణికం ఠాగూర్ చేవిలో వేసినట్టు సమాచారం. మరి ఆ ముఖ్య నేత మంత్రాంగం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.