రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడిన కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ దీక్షకు దిగింది. తెలంగాణ కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో గాంధీ భవన్ లో ఈ నిరసన దీక్ష చేపట్టారు. రాజ్యాంగంపై గౌరవం లేకుండా సీఎం మాట్లాడారని మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు.
ఇక మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేసీఆర్ కు శవయాత్ర నిర్వహించారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలతో గాంధీభవన్ పరిసరాలు మార్మోగాయి. ఈ సందర్భంగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతరావు మాట్లాడుతూ.. కేసీఆర్ పై మండిపడ్డారు. రాజ్యాంగంపై సీఎం తాగి మాట్లాడారని విమర్శించారు. బీజేపీ, టీఆర్ఎస్ తోడు దొంగలని ఆరోపించారు.
కేసీఆర్ 317 జీవో, రైతు సమస్యలు, మహిళలపై ఘోరాల గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. రాజ్యాంగంపై ఆయనకు ఉన్న ఇబ్బందులు ఏంటని ప్రశ్నించారు. మనకు తెలివి లేని ముఖ్యమంత్రి ఉన్నాడని.. ఇప్పటిదాకా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేస్తున్నారని ఆరోపించారు.
8 ఏళ్లుగా పడుకుని ఇప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడతారా? ఇవన్నీ చీప్ లిక్కర్ మాటలు అంటూ విమర్శలు చేశారు సునీతారావు. రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని.. పేదలు ఇంకా పేదలు అవుతున్నారే గానీ.. కేసీఆర్ వల్ల జరిగిందేం లేదని మండిపడ్డారు.