ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. గురుకులాలను అభివృద్ధి చేసిన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్న అధికారి. ఈమధ్యే వీఆర్ఎస్ తీసుకుని బీఎస్పీ గూటికి చేరారు. కాన్షీరాం ఆశయాల కోసం పోరాడతానని ప్రకటించి… సీఎం కేసీఆర్ టార్గెట్ గా విమర్శలు సంధిస్తున్నారు. దొరల గడీలను బద్దలు కొడతామని అంటున్నారు. ఇదంతా ఓకే.. ఓసారి రావిర్యాల కాంగ్రెస్ సభ దగ్గరకు వెళ్దాం. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి మాట్లాడారు. ఆ వ్యాఖ్యలే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి.
ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ కు మరో ఆరేళ్లపాటు ఉద్యోగంలో కొనసాగే అవకాశం ఉంది.. డీజీపీ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అయినా.. వివక్షను తట్టుకోలేక ఉద్యోగానికి రాజీనామా చేశారని రావిర్యాల సభలో అన్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ పెట్టే బాధలు పడలేక… అవమానాలు భరించలేక… దొరల దగ్గర బానిసగా బతకలేక… ఎంగిలి మెతుకులు తినలేక… దళిత బిడ్డ ఐపీఎస్ పదవికి రాజీనామా చేశారని చెప్పారు.
బీఎస్పీలో చేరి బహుజనుల అభ్యున్నతే లక్ష్యమంటూ ముందుకెళ్తున్నారు ఆర్ఎస్ ప్రవీణ్. ఇటు టీపీసీసీ చీఫ్ అయ్యాక కాంగ్రెస్ ను గాడిన పెట్టి.. పూర్వ వైభవం తీసుకొచ్చే పనిలో ఉన్నారు రేవంత్ రెడ్డి. ఇలాంటి తరుణంలో రేవంత్ నోట ఆర్ఎస్ పేరు ఎందుకొచ్చిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. ఎంత దళితుల గురించి మాట్లాడుతున్నా సరే.. వేరే పార్టీలో ఉన్న నాయకుడి గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఏముందనేది విశ్లేషకుల వాదన. ఈ క్రమంలోనే కేసీఆర్ వ్యతిరేక వర్గాలన్నీ ఏకం అవుతున్నాయా..? అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.