రానున్న ఎన్నికల్లో హంగ్ ఏర్పడుతుందని.. అదే జరిగితే.. బీఆర్ఎస్ తమతో కలవాల్సిందేనని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇది పార్టీకి నష్టం తెచ్చేలా ఉందని హస్తం నేతలు ఒక్కొక్కరుగా రియాక్ట్ అవుతున్నారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై తమదైన రీతిలో ఖండిస్తున్నారు.
అద్దంకి దయాకర్ స్పందిస్తూ.. కోమటిరెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగిస్తాయని అన్నారు. సీనియర్ నేత అయి ఉండి ప్రతిసారి ఇలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. కాంగ్రెస్ హైకమాండ్ కోమటిరెడ్డి వ్యాఖ్యలపై దృష్టి పెట్టాలని కోరారు. మాట్లాడే ముందు కొంత ఆలోచించి మాట్లాడాలని సూచించారు.
వీహెచ్ రియాక్ట్ అవుతూ.. రాష్ట్రంలో ఎన్నికల వేళ ఎంపీ ఇలా మాట్లాడటం సరికాదన్నారు. నేతలు ఇలాంటి మాటలు మాట్లాడితే కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటాయని అభిప్రాయపడ్డారు. కీలక సమయంలో పార్టీ కేడర్ ను కన్ఫ్యూజ్ చేయొద్దని.. అందరూ ఐక్యంగా పనిచేసేందుకే ప్రయత్నిస్తున్నారని తెలిపారు. తప్పులుంటే సరిదిద్దుకుని ముందుకెళ్లాలన్నారు. అంతేకానీ, ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని సూచించారు వీహెచ్.
ఎన్నికల ముందు, ఆ తర్వాత బీఆర్ఎస్ తో పొత్తులు ఉండే ప్రసక్తే లేదని మల్లు రవి క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో హంగ్ రాదని, మూడింట రెండు వంతుల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని జోస్యం చెప్పారు. పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి రాదని తెలిపారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ తోనే కాంగ్రెస్ పార్టీకి ప్రధాన పోటీ ఉందని చెప్పారు. సీనియర్ నాయకుడు కాంగ్రెస్ తో బీఆర్ఎస్ కలిసి పని చేస్తుందని మాట్లాడడం సరైంది కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
టీపీసీసీ ఉపాధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పొత్తులపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఇవి కార్యకర్తల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉన్నాయన్నారు. కార్యకర్తలు హాత్ సే హాత్ జోడో యాత్రలో ఎంతో శ్రమించి పనిచేస్తూ పార్టీని బలోపేతం చేస్తున్న తరుణంలో ఇలాంటి మాటలు గందరగోళంలో పడేస్తాయని చెప్పారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా పనిచేసిన కోమటిరెడ్డి ఇలా మాట్లాడడం సబబు కాదన్నారు. పొత్తులు ఉండవని వరంగల్ సభలోనే రాహుల్ గాంధీ మాట్లాడారని గుర్తు చేశారు.