రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలకు ప్రయత్నించింది. అయితే.. పోలీసులు ఎక్కడికక్కడే కీలక నేతలను గృహనిర్బంధం చేశారు. కొన్నిచోట్ల కార్యకర్తలనూ అదుపులోకి తీసుకున్నారు.
అసోం సీఎం హిమంతపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ ధర్నాలకు పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. దీంతో ఎస్పీ కార్యాలయాలు, కమిషనరేట్ల ముందు నిరసనలకు ప్రయత్నించారు కాంగ్రెస్ శ్రేణులు.
అయితే.. కీలక నేతలను ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు పోలీసులు. రేవంత్ రెడ్డి ఇంటి వద్ద భారీగా మోహరించారు. ఇంటి చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు.
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, షబ్బీర్ అలీ సహా ఇతర కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. మరోవైపు జూబ్లీహిల్స్ లో అసోం సీఎంపై కేసు నమోదైంది. రేవంత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు.