ఉత్కంఠ వీడింది. ఇంద్రవెల్లి వేదికగా కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి వైపు నిలిచేవారెవరో తేలిపోయింది. దళిత, గిరిజన దండోరా కార్యక్రమాన్ని ప్రకటించినప్పటి నుంచి ఎంత మంది కార్యకర్తలు తరలివస్తారనే దానికంటే.. ఎవరెవరు నేతలు వచ్చి రేవంత్ రెడ్డితో చేయి కలుపుతారు… ఎవరెవరు రాకుండా చేయిస్తారు అన్న దానిపైనే రాష్ట్ర రాజకీయవర్గాల్లో మొదటి నుంచి ఆసక్తికరమైన చర్చ జరిగింది. అయితే ఆ అనుమానాలకు ఫైనల్లీ ఫుల్ స్టాప్ పడింది.
రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ ప్రకటించిన తర్వాత .. అలకబూని, పార్టీతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్న నేతలెవరూ ఇంద్రవెల్లికి రాకపోవచ్చనని అందరూ అంచనా వేశారు. కానీ ఆ అంచనాలు పటాపంచలయ్యాయి. రారు.. రాలేరు.. అనుకున్న నేతలు కూడా ఇంద్రవెల్లి సభకు వచ్చి ఆశ్చర్యపరిచారు. తాజా మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మినహా .. దాదాపు రాష్ట్రస్థాయి కీలక నేతలంతా సభ వేదికపై కనిపించారు. ఇందులో జగ్గారెడ్డి తాను జ్వరం కారణంగా రాలేనని ముందే చెప్పగా.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీలో ప్రధానితో అపాయింట్‌మెంట్ ఉన్నందున హాజరుకాలేనని వివరణ ఇచ్చారు. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గైర్హాజరుకు కారణం మాత్రం తెలియరాలేదు.
భట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, పొన్నాల లక్ష్మయ్య, మధుయాష్కీ, గీతారెడ్డి, మహేశ్వర్ రెడ్డి, షబ్బీర్ అలీ, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, అంజన్ కుమార్ యాదవ్, సంపత్, సీతక్క, పోడెం వీరయ్య .. ఇలా చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ సీనియర్ నేతలతో సభ నిండుగా కనిపించింది. అందరూ ముక్తకంఠంతో కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటం చేద్దామని.. కలిసి నడుద్దామని ప్రతినబూనారు. నేతలందరినీ ఒకే వేదికపై చూడటంతో.. కాంగ్రెస్ శ్రేణుల్లోనూ కొత్త ఉత్సాహం తొణికిసలాడింది.