– బీఆర్ఎస్ పై స్వరం పెంచిన ఎంఐఎం
– ఈసారి 50 స్థానాల్లో పోటీకి సై
– అసెంబ్లీలో కేటీఆర్ తో అక్బరుద్దీన్ వాగ్వాదం
– అనూహ్యంగా కాంగ్రెస్ నేతలతో భేటీ
ఎన్నికల సమయం దగ్గర పడేకొద్దీ తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ ను నానా తిట్లు తిట్టి బీఆర్ఎస్ కు దగ్గరైన ఎంఐఎం రివర్స్ గేర్ వేసినట్టు కనిపిస్తోంది. ఇప్పుడు బీఆర్ఎస్ తో వైరానికి దిగి కాంగ్రెస్ కు దగ్గరవుతుందా? అనే సందేహం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ ను కడిగిపారేశారు అక్బరుద్దీన్ ఒవైసీ. పాతబస్తీ బాధలన్నీ చెబుతూ.. ఇంకెన్నాళ్లు అభివృద్ధి కోసం ఎదురుచూడాలని నిలదీశారు. అయితే.. ప్రభుత్వం కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయింది. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో తాము 50 స్థానాల్లో పోటీకి దిగుతామని అన్నారు అక్బరుద్దీన్. దీనిపై సర్వత్రా చర్చ జరుగుతుండగా.. అక్బరుద్దీన్ కాంగ్రెస్ నేతలతో భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది.
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో అక్బరుద్దీన్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో 50 నియోజకవర్గాలలో నిజంగా పోటీ చేస్తారా? అని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అడిగారు. కచ్చితంగా పోటీ చేస్తామని అక్బరుద్దీన్ చెప్పారు. బీజేపీ బీ టీమ్ అని ప్రచారం చేస్తున్నారని, కానీ తాము ప్రజాస్వామ్యయుతంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. దేశం, రాష్ట్రంలో బీజేపీ చేసే అరాచకాలు పెరిగిపోతున్నాయని మండిపడ్డారు అక్బరుద్దీన్. బీజేపీ పూర్తిగా ఓటు బ్యాంకు పొలరైజ్ చేస్తోందని, తాము తమ వర్గానికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఇలా అయితే ఎంఐఎం చేస్తున్నదేంటని శ్రీధర్ బాబు ప్రశ్నించారు. మీరు మీ వర్గానికి అంటే.. బీజేపీ ఎజెండా కూడా అదే కదా అని ప్రశ్నించారు. ఎవరు ఏమనుకున్నా.. వచ్చే ఎన్నికల్లో ఎంఐఎం మాత్రం విస్తరిస్తుందని అక్బరుద్దీన్ స్పష్టం చేశారు.
రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు మిత్రపక్షంగా ఉండేవి. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో రెండు పార్టీల మధ్య పొరపచ్చాలు ఏర్పడ్డాయి. రాష్ట్ర విభజన అనంతరం బీఆర్ఎస్ కు మిత్రపక్షంగా కొనసాగుతోంది ఎంఐఎం. అయితే.. ఈ బంధం కూడా తెగే పరిస్థితులు కనిపిస్తున్నాయి.