రైతుల చావుకు కారణమైన టీఆర్‌ఎస్, బీజేపీని రైతులు ఉరేస్తారన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ నేతలతో కలిసి గవర్నర్ తమిళిసైని కలిశారు రేవంత్. తెలంగాణలో పెరిగిపోయిన నిరుద్యోగం, 111 జీవో, విద్యుత్ ఛార్జీల పెంపు, డ్రగ్స్, తదితర అంశాలపై ఫిర్యాదు చేశారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు రేవంత్.
రాష్ట్రంలో తాజాగా పరిస్థితులపై గవర్నర్ కు నివేదిక ఇచ్చామని అన్నారు. రైతుల గుండెలు ఆగిపోతుంటే కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదని.. కొనుగోలు కేంద్రాలు తెరవడం ఆలస్యం వల్ల 30శాతం పంట దళారుల చేతుల్లోకి వెళ్ళిపోయిందని చెప్పారు. మిల్లర్ల దగ్గర ధాన్యం సేకరణ వివరాలు ఉన్నాయన్న ఆయన.. అమ్మిన రైతులకు బోనస్ ఇప్పించాలని డిమాండ్ చేశారు.
8 లక్షల 34వేల మెట్రిక్ టన్నుల బియ్యం మాయం అయ్యాయని.. వాటి విలువ రూ.2,600 కోట్లు ఉంటుందని చెప్పారు రేవంత్. దీనిపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే గల్లీలో ఒకరు ఢిల్లీలో ఒకరు ధర్నాలు చేశారని మండిపడ్డారు. వడ్లు కొనాల్సింది పాకిస్తాన్ ప్రధానా అంటూ మోడీని నిలదీశారు. పంట వేయకుండా పడావు పెట్టిన ఎకరాకు రూ.15వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వాలన్నారు.
కేసీఆర్ అవినీతిపై వివరాలు ఉంటే బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు రేవంత్. ధాన్యం కొనుగోలు గురించి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి పోరాటం చేసిందని గుర్తు చేశారు. బీజేపీ నేతలకు సిగ్గు లేదని.. రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారని తెలిపారు. తక్కువ ధరకు ధాన్యాన్ని రైతులు అమ్ముకోవద్దని.. కేసీఆర్ మెడలు వంచి మద్దతు ధర ఇప్పిస్తామన్నారు. 12 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోందని ధీమా వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి.