రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఇదే విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. రాజ్ భవన్ లో కాంగ్రెస్ నేతల బృందం తమిళిసైని కలిసింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఆమెకు వివరించారు నేతలు.
గవర్నర్ తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు భట్టి. టీఆరెస్ నేతలు పోలీసులను వాళ్ళ పనులు చేయనియ్యడం లేదని ఆరోపించారు. వనమా రాఘవ దాష్టీకం, రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య, మంథనిలో అడ్వకేట్ హత్య, శీలం రంగయ్య ఘటనలు గవర్నర్ కు వివరించినట్లు తెలిపారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయన్న భట్టి.. పోలీస్ శాఖపై సమీక్ష చేయాలని గవర్నర్ ను కోరినట్లు చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో పోలీస్ శాఖ సరిగ్గా పనిచేయడం లేదన్నారు.
పోలీస్ నుంచి రక్షణ ఉంటదనే భావన ప్రజలు కోల్పోయారని ఆరోపించారు భట్టి. టీఆర్ఎస్ నాయకులు చెప్తేనే పోలీస్ దగ్గర న్యాయం జరుగుతోందన్నారు. రాజ్యాంగం ప్రకారం పోలీస్ తన విధులు తాను చేయాలని.. ఒత్తిళ్లకు లొంగకూడదని గుర్తు చేశారు. గవర్నర్ ను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు సీతక్క, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి కూడా ఉన్నారు.