వికారాబాద్ జిల్లా పరిగి మార్కెట్ యార్డు దగ్గర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఓవైపు మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం జరుగుతుండగా.. ఇంకోవైపు కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనకు దిగారు. దీంతో కాసేపు టెన్షన్ వాతావరణం కనిపించింది.
మార్కెట్ కమిటీ చైర్మన్ గా సురేందర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి వచ్చారు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఎస్టీ, బీసీ బంధు ప్రకటించాలని కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనకు దిగారు. మంత్రికి వినతిపత్రం ఇచ్చేందుకు అనుమతివ్వాలని పోలీసులకు చెప్పారు. దానికి వారు అంగీకరించకపోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది.
మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలని నినాదాలు చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.