కేంద్రం పెంచిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు.. రాష్ట్రం పెంచిన విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు కొనసాగించింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపుతో.. జిల్లా కలెక్టరేట్ల దగ్గర ధర్నాలు, ముట్టడిని పెద్దఎత్తున నిర్వహించారు కాంగ్రెస్ శ్రేణులు.
కరీంనగర్, వరంగల్ కలెక్టరేట్ల దగ్గర కాంగ్రెస్ కార్యకర్తలు గేట్లను తోసుకుంటూ లోనికి దూసుకెళ్లారు. గద్వాల దగ్గర ఏఐసీసీ కార్యదర్శి సంపత్ ఆధ్వర్యంలో ధర్నా పెద్దఎత్తున జరిగింది. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద జిల్లా డీసీసీ అధ్యక్షులు నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కొనసాగించారు.
మహబూబాద్ జిల్లా కేంద్రంలో పోలీసులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే.. బలరాం నాయక్ కలగజేసుకుని డ్యూటీలో ఉన్న ఎస్సైని తిట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కాసేపు వారిద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది.
పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, విద్యుత్ చార్జీలు, నిత్యవసర ధరలకు వ్యతిరేకంగా, వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మంచిర్యాల కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. తర్వాత కలెక్టర్ ని కలిసి వినతి పత్రం అందజేశారు కొక్కిరాల సురేఖ.
పెంచిన ధరలను తగ్గించాలని, యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ యూత్ కాంగ్రెస్ నాయకులు అభిజయ్ రెడ్డి ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. తర్వాత కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.
కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మెదక్ లో కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించారు. నిత్యవసర వస్తువులు, ఇంధన ధరలు, వంట గ్యాస్, విద్యుత్ చార్జీల మోత, ఆర్టీసీ చార్జీల బాదుడు, వరి కొనుగోళ్లపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.
నకిరేకల్ నియోజకవర్గం కట్టంగూర్ మండల కేంద్రంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి మల్లయ్య ఆధ్వర్యంలో వెయ్యి బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. మోడీ, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. మోడీ అహంకారంతో.. కేసీఆర్ అధికార మదంతో ఉన్నారని.. ఇద్దరు కుమ్మక్కై దేశ, రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు.
పెరిగిన పెట్రోల్, డీజిల్ కరెంట్, గ్యాస్ ధరలను తగ్గించాలని పెద్దపల్లి నియోజకవర్గంలో అన్ని మండలాల్లో, పట్టణ ప్రాంతాల్లో అంబేద్కర్ విగ్రహాల దగ్గర కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు. మోడీ, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
హన్మకొండ జిల్లాలో కాంగ్రెస్ నేతలు భారీ ర్యాలీ తీశారు. కేంద్రం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు.. రాష్ట్రం పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా హన్మకొండ ఏకశిలా పార్కు నుండి రూరల్ కలెక్టరేట్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన ధర్నాలో పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ పాల్గొన్నారు. అన్ని జిల్లాల్లో డీసీసీల ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలలో కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.