కాంగ్రెస్ అధిష్టానం అంటే లెక్కలేదు… పార్టీ నిర్ణయాన్ని గౌరవించే ఓపిక లేదు… అవతలి పార్టీకి ఆయుదంగా మారుతున్నానన్న ఆలోచన లేదు… పార్టీకి పునర్వైభం ఆలోచన అసలే లేదు కానీ నడిపించే నాయకుడి కాళ్లలో కట్టెలు పెట్టడం ఏంటయ్యా కోమటిరెడ్డి… అంటూ ఎంపీ కోమటిరెడ్డిపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి.
పీసీసీ పదవి రాలేదన్న కోపంలో ఉన్న ఎంపీ కోమటిరెడ్డి పార్టీ బలోపేతాన్ని గాలికొదిలేశారు. కొత్త అధ్యక్షుడు వరుసగా సభలు, సమావేశాలు పెడుతూ పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపుతుంటే తన వంతు బాధ్యతగా అండగా ఉండాల్సిన ఎంపీ… సభలకు డుమ్మా కొడుతున్నారు. మన పార్టీ సభే కాదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఏమాత్రం అవకాశం దొరికినా ప్రతిపక్షాల కన్నా ముందే రేవంత్ పై అడ్డగోలుగా మాట్లాడుతున్నారు.
తాజాగా… కేటీఆర్ కోవర్టు రాజకీయంతో రేవంత్ రెడ్డి పిచ్చాపాటిగా మాట్లాడిన మాటలను రికార్డు చేశారు. కాంగ్రెస్ తెలంగాణలో పోరాడుతుంటే కేటీఆర్ కు, తెలంగాణ ప్రభుత్వానికి కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కితాబివ్వటాన్ని ఆయన తప్పుపడుతూ గాడిద అంటూ సంభోదించారు. దీన్ని కేటీఆర్ రాజకీయం చేయాలనుకోగా… రేవంత్ వెంటనే శశిథరూర్ ను క్షమాపణ కూడా కోరారు. ఆయన కూడా నేను అలా మాట్లాడాల్సింది కాదు అంటూ రేవంత్ తో మాట కలిపారు. అలా వివాదం సమసిపోయింది. కాంగ్రెస్ స్టేట్ ఇంచార్జ్, ఎంపీ ఠాగూర్ కూడా సుపారీ జర్నలిజం అంటూ మండిపడ్డారు. సుపారి ఇచ్చిన నాయకత్వాన్ని గట్టిగానే ప్రశ్నించి రేవంత్ కు అండగా నిలిచారు.
కానీ ఎంపీ కోమటిరెడ్డి మాత్రం… మేధావి అయిన శశిథరూర్ గారిని అంత మాట అంటారా? ఆయనపై పీసీసీ చీఫ్ చేసిన వ్యాఖ్యలతో సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా తీవ్ర మనస్థాపానికి గురైనట్లు ట్వీట్ చేశారు. అనుకున్నోళ్లు బాగానే ఉన్నారు కానీ మధ్యలో రాజకీయం చేయటానికి ప్రయత్నించే వారే మొసలి కన్నీరు కారుస్తున్నారంటూ ఈ ట్వీట్ పై కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. గజ్వేల్ లో కాంగ్రెస్ సభ పెడితే దూరంగా ఉంటున్న కాంగ్రెస్ ఎంపీ కూడా… పీసీసీ చీఫ్ పై మాట్లాడే వారే అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్లుగా… కాంగ్రెస్ నీడలో ఎదిగిన కోమటిరెడ్డి ఇప్పుడు పార్టీ నాయకత్వాన్నే ప్రశ్నించే స్థితికి దిగజారారని, ఇక మా ఓపిక కూడా హద్దు ఉంటుందన్న విషయం మర్చిపోవద్దంటూ హెచ్చరిస్తున్నారు.
ఇక ఇదే అంశంపై ఎంపీ శశిథరూర్ కూడా స్పందించారు. రేవంత్ రెడ్డి తనకు ఫోన్ చేసి విచారం వ్యక్తం చేశారని, తనను అర్థం చేసుకోగలనని, ఇక ఈ ఎపిసోడ్ ను పక్కనపెట్టి ఏఐసీసీ మార్గదర్శకత్వంలో తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయటం కోసం మేమంతా కలిసి పనిచేస్తామంటూ శశిథరూర్ ప్రకటించారు.
Advertisements