– ఈటల రాజేందర్ బాధను..
– తమ బాధగా భావిస్తున్న హస్తం నేతలు
– ఇప్పటికైనా కళ్లు తెరవాలని సూచన
– బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని..
– తమ దగ్గరకు వచ్చేయాలని ఇండైరెక్ట్ హింట్
ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ వెంటే ఉండి ఆయన స్థాయి ఫాలోయింగ్ సంపాదించారు ఈటల రాజేందర్. కారణాలు ఏవైనా ఆయన టీఆర్ఎస్ ను వీడాల్సి వచ్చింది. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కేంద్రంలోని బీజేపీ మాత్రమేనని భావించి కాషాయ కండువా కప్పుకున్నారు ఈటల. పార్టీలో ఏ పదవి ఇచ్చినా తన పని చేసుకుపోతున్నారు. కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యంగా సవాళ్లు విసురుతున్నారు. అయితే.. ఈమధ్య కాలంలో ఆయన తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. దీనికితోడు తాజాగా మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షాల్లో కోవర్టులు ఉన్నారని.. కేసీఆర్ కోసం పని చేస్తున్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రతిపక్ష పార్టీలు అన్నింటికీ వర్తించినా.. కాంగ్రెస్ మాత్రం బీజేపీని టార్గెట్ చేసింది.
ఈటల వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. ఏ లక్ష్యం కోసం ఆయన బీజేపీలోకి వెళ్ళారో అది నెరవేరడం లేదన్నారు. ఇది ఈటల మాటల్లో స్పష్టమౌతోందని చెప్పారు. కేసీఆర్ ను గద్దె దించాలని బీజేపీలోకి వెళ్లిన ఆయనకు.. అక్కడకు వెళ్లిన కొన్నాళ్ళకే సీన్ అర్థమైందని తెలిపారు. అక్కడ కేసీఆర్ కోవర్టులు ఉన్నారని తెలుసుకున్నారని.. దీంతో రాజేందర్ లక్ష్య సాధన కోసం ప్రత్యామ్నాయ మార్గం వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఈటలతోపాటు వివేక్, విశ్వేశ్వరరెడ్డి కూడా బాధపడుతున్నారని.. బీజేపీ ఐడియాలజీలో ఇమడలేకపోతున్నారని చెప్పారు.
రేవంత్ తోపాటు.. కాంగ్రెస్ నేతలు కోదండరెడ్డి, చెరుకు సుధాకర్ కూడా ఇదే పాట పాడారు. ఈటలది కమ్యూనిస్టు భావజాలమని.. బీజేపీలో ఇబ్బంది పడుతున్నట్టు కనిపిస్తోందన్నారు కోదండరెడ్డి. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని.. కేంద్రం నుండి వచ్చిన పంచాయతీ నిధులు దారి మళ్లిస్తే.. బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అడిగారు. రాజేందర్ విస్తుపోయే మాటలు చెప్పారని.. ఆయన ఉన్న పార్టీ కేసీఆర్ కి వ్యతిరేకంగా పని చేయడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ని ఓడించడం కోసం బీజేపీ, బీఆర్ఎస్ కలిసి డ్రామాలు చేస్తున్నాయన్నారు. కేసీఆర్ కోవర్టు ఆపరేషన్ చేస్తున్నారని ఇప్పుడు బాధపడితే ఏం లాభమన్న ఆయన.. ఈటల ఇప్పటికైనా నిజం తెలుసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ఒక్కటే బీఆర్ఎస్ ను ఓడించగలదని చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలతో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఈటలను తమవైపు తిప్పుకునే ప్రయత్నం జరుగుతోందని విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆయనతోపాటు ఇతర నేతలను కూడా హస్తం గూటికి తీసుకొచ్చేందుకే ఇలా మాట్లాడుతున్నారని అంటున్నారు. నిజానికి ఈటల మాట్లాడిన ప్రతిపక్షాల్లో కాంగ్రెస్ కూడా ఉన్నట్టేనని.. ఒకవేళ ఆయన ఇక్కడకు వచ్చినా అదే పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది కదా అని వివరిస్తున్నారు విశ్లేషకులు. మొత్తానికి ఈటల బాధను తమ బాధగా మీడియాతో పంచుకుంటున్న కాంగ్రెస్ నేతల వ్యూహం ఏంటో అర్థం అవుతోందని చెబుతున్నారు.