ఎంజీఎం ఆస్పత్రి అభివృద్ధి చెందిందంటే అది కాంగ్రెస్ పార్టీ పుణ్యమేనని అన్నారు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయిని రాజేందర్రెడ్డి. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో పేరుకుపోయిన సమస్యలను పరిశీలించేందుకు రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బృందం వెళ్లింది. వివిధ విభాగాల్లో పర్యటించి.. రోగులకు అన్ని రకాల ఆరోగ్య సదుపాయాలు అందుతున్నాయా..? లేదా..? అని రోగులను అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రభుత్వ ఆసుపత్రులు నిర్వీర్యం అవుతున్నాయని ఆరోపించారు రాజేందర్ రెడ్డి. ఆసుపత్రికి వచ్చే రోగులకు కనీసం మందులు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ఎంజీఎం ఆసుపత్రి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు అందించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలతో కేఎంసీ ప్రాంగణంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తే.. దానికి అనుగుణంగా సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విరుచుకుపడ్డారు. అనేక సమస్యలతో అల్లాడుతున్న ఎంజీఎం లో అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయని వైద్య శాఖ మంత్రి హరీష్ రావు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు రాజేందర్ రెడ్డి.
ప్రభుత్వ ఆసుపత్రులు కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అభివృద్ధి చెందాయని తెలిపారు. ఎంజీఎంలో పేరుకుపోయిన సమస్యలను నెల రోజుల్లో పరిష్కరించకుంటే.. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆసుపత్రుల ముందు చావు డప్పు ముగిస్తామని హెచ్చరించారు రాజేందర్ రెడ్డి.