పంచ భూతాలను దోచుకుంటూ.. సీఎం కేసీఆర్ అణిచివేతలకు పాల్పడుతున్నారని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, సీనియర్ అధికార ప్రతినిధులు బెల్లయ్య నాయక్, అద్దంకి దయాకర్, నాయకులు చరణ్ కౌశిక్ యాదవ్ లు ఆరోపించారు. రాష్ట్రంలో సాగుతున్న అణిచివేత పాలనపై సామాజిక న్యాయం కోసం టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఉధృతమైన పోరాటం చేస్తున్నామన్నారు.
కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం, సామాజిక న్యాయం కోసం ఇప్పటికే తెలంగాణలో దళిత, గిరిజన ఆత్మ గౌరవ దండోరా కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. దళిత, గిరిజనుల్లో ఆత్మ గౌరవాన్ని పెంపొందించేందుకు కాంగ్రెస్ కృషి చేస్తోందన్నారు. నీళ్లు, నిధులు నియామకాలు అనే ప్రాథమిక సిద్ధాంతాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. పోరాటాలు చేసి స్వయం పాలన సాధించుకున్న రాష్ట్రం తీవ్రమైన దోపిడీకి, అణిచివేతలకు గురవుతోందని ఆరోపించారు.
బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. రాష్ట్రంలో పంచ భూతాలను దోచుకొని తెలంగాణలోని వనరులన్నీ చరబట్టారని అన్నారు. అభివృద్ధి పేరిట నీళ్లు, భూమి, విద్యుత్ తదితర అంశాలలో అడ్డగోలు దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. పోలీసులను ప్రజల శాంతి భద్రతల కోసం కాకుండా.. ప్రజా పోరాటాలు చేసే సంస్థలపైన, ప్రతిపక్ష రాజకీయ పార్టీలపైన ఉపయోగించి రాజకీయ అరాచకానికి పాల్పడుతున్నారని విమర్శించారు.
దోపిడి, అణిచివేతలపై కాంగ్రెస్ పార్టీ నిరంతర పోరాటం చేస్తుందన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్.. వచ్చిన తెలంగాణలో సామాజిక న్యాయాన్ని సాధించి, ప్రజా తెలంగాణ నిర్మాణం అయ్యే వరకు రేవంత్ రెడ్డి నాయకత్వంలో పోరాటం సాగిస్తామన్నారు.