న్యూ ఇయర్ వేడుకల్లో ఓ ఎమ్మెల్యే నైతిక విలువలకు నీళ్ళొదిలాడు.పిచ్చిగంతులేస్తూ గాల్లోకి కాల్పులు జరిపాడు. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్స్ వైరల్ అయ్యాయి. మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన పార్టీశ్రేణులనే కాకుండా సామాన్య ప్రజలను సైతం నివ్వెర పోయేలా చేసింది. కోట్మా నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే సునీల్ సరాఫ్ కొత్త ఏడాది వేడుకల సందర్భంగా జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదికపైకి ఎక్కి డ్యాన్స్ చేసిన ఆయన తన జేబు నుంచి రివాల్వర్‌ను బయటకు తీశారు. అనంతరం డ్యాన్స్ చేస్తూ గన్‌ను ఎక్కుపెట్టి గాల్లోకి కాల్పులు జరిపారు.
ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించినట్లు మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. కాగా, కాంగ్రెస్ ఎమ్మెల్యే సునీల్ సరాఫ్‌పై ఇటీవల కూడా ఒక కేసు నమోదైంది.
భర్త, పిల్లలతో కలిసి రేవాంచల్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణించిన మహిళను మద్యం మత్తులో మరో ఎమ్మెల్యేతో కలిసి లైంగికంగా వేధించాడు. దీంతో ఆ మహిళ భర్త ట్విట్టర్ ద్వారా పోలీసుల సహాయం కోరాడు. రైల్వే పోలీసులు ఆ మహిళకు సహాయం చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సునీల్ సరాఫ్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు.