మధ్యప్రదేశ్ లో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎవరూ ఎక్కడా వినని, ఎక్కడా చూడని వింతైన పోలిక తెచ్చి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు. బీజేపీని ఆయన ‘జంతువులతో’ కూడిన పార్టీగా పోల్చారు. పైగా తమ రాష్ట్రంలోని కునో నేషనల్ పార్క్ లో గల ఛీతాలు తన పార్టీకి ముప్పు తెస్తాయని ఆందోళన చెందుతున్నాడట. ఆఫ్రికా నుంచి ఈ పార్క్ కు తెప్పించిన ఈ జంతువులు ‘కాంగ్రెస్ ఓటర్లను’ ‘కబళించేంతగా’ పెరిగిపోతాయని కూడా భయపడుతున్నాడట.
మధ్యప్రదేశ్.. శివపురి జిల్లాలోని కరేరా అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన ప్రాగీలాల్ జాతవ్ అనే ఈయన .. బీజేపీ కుట్ర చేసి ఛీతాలను ఆఫ్రికా నుంచి ఇక్కడికి తెప్పించిందని ఆరోపిస్తున్నారు. ఇవి కాంగ్రెస్ పార్టీ ఓటర్లను ‘తినేయడం’ ఖాయమన్నారు. మంగళవారం తమ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఈయన.. కాంగ్రెస్ పేదలు, బడుగువర్గాల ప్రయోజనాలకోసం పని చేసే పార్టీ అని, వారి విషయంలో బీజేపీ కన్నా ఎక్కువగా పాటు పడుతుందని చెప్పారు.
బీజేపీలో ‘జంతు ప్రయోజనాలు’ ఇమిడి ఉన్నాయని, ఆఫ్రికా నుంచి ఛీతాలను తెప్పించేందుకు ఆ పార్టీ రూ. 117 కోట్లను ఖర్చు పెట్టిందని ప్రాగీలాల్ అన్నారు. ‘ప్రస్తుతం కునో నేషనల్ పార్క్ లో ఉన్నఈ జంతువులు చిన్న వయస్సులో ఉన్నాయి. కానీ ఇవి పెరిగి పెద్దయ్యాక మన కార్యకర్తలను తినేసి.. ఓట్లను తగ్గించేస్తాయి.. ఇదంతా బీజేపీ ప్లాన్ లో భాగమే’ అని ఆయన వ్యాఖ్యానించాడు.
ఈ స్పీచ్ ఇచ్చాక చిరునవ్వు నవ్వుతూ .. మరికొద్దిసేపట్లో మన రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్ నాథ్ వస్తారని, ఆయనకు స్వాగతం చెబుదామని వేదిక దిగాడు. 2020 నవంబరులో కరేరా అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో ప్రాగీలాల్ .. సుమారు 30 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.