హైదరాబాద్: ప్రగతి భవన్‌లో కుక్క సచ్చిపోతే డాక్టర్ మీద కేసు పెట్టారు. రాష్ట్రంలో వందలమంది జ్వరాలతో చనిపోతుంటే ఎవరి మీద కేసులు పెట్టాలని కాంగ్రెస్ శాసనసభ్యుడు జగ్గారెడ్డి ప్రశ్నించారు. ‘బ్లీచింగ్ పౌడర్ వేయడానికి కూడా డబ్బులు లెవ్వా..? అధికారులు నిధులు లేవని చెప్తున్నారు.. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు..’ అని జగ్గారెడ్డి నిలదీశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రక్త పరీక్షలు చేయడానికి కూడా సిబ్బంది, ఎక్విప్‌మెంట్ కొరత ఉందని దుయ్యబట్టారు. ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగానికి పెద్దపీట వేయాల్సింది పోయి నిర్లక్ష్యంగా వుండటం ప్రజారోగ్యానికి పెనుముప్పు అవుతోందని అన్నారు.
రాజేందర్ చాలా ఖర్చుపెట్టాడు..
టీఆర్‌ఎస్ జెండా ఓనర్లు మేమేనని ఈటల అనడంలో ఏమాత్రం తప్పులేదని, పార్టీ కోసం రాజేందర్ చాలా ఖర్చు పెట్టాడని కాంగ్రెస్ శాసనసభ్యుడు జగ్గారెడ్డి అన్నారు. టీఆర్ఎస్‌లో జరుగుతున్న ఓనర్ల పంచాయితీపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు.గతంలో తాను బ్రతువు తెరువు కోసమే టీఆర్ఎస్‌లోకి వెళ్లి వచ్చానని చెబుతున్న జగ్గారెడ్డి.. ఎవరు మంత్రులైనా చేసేది ఏమీ లేదని వ్యాఖ్యానించారు.