– అమిత్ షాతో భేటీ నిజమే..
– బీజేపీలో చేరిక చర్చకు రాలేదు
– అది మర్యాదపూర్వక బేటీనే..
– టీఆర్ఎస్ దుష్ప్రచారాన్ని నమ్మొద్దు
– కేసీఆర్ అవినీతిపై బహిరంగ యుద్ధం చేస్తా..
– పార్టీ మార్పుపై రాజగోపాల్ రెడ్డి క్లారిటీ
ఈమధ్య కేంద్రమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అప్పటి నుంచి బీజేపీలో చేరికపై అనేక కథనాలు వచ్చాయి. ముహూర్తం ఫిక్స్ అయింది.. అదిగో ఇదిగో అంటూ ఏవేవో వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి.. మీడియా ముందుకొచ్చారు. తాను పార్టీ మారుతున్నానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అమిత్ షాను మర్యాద పూర్వకంగానే కలిసినట్టుగా స్పష్టం చేశారు. అంతదానికే బీజేపీలో చేరుతున్నట్టు.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రచారం చేస్తారా? అంటూ ఫైరయ్యారు.
కేసీఆర్ కుటుంబ అవినీతి, రాష్ట్రంలో ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తున్న తనను రాజకీయంగా దెబ్బతీసేందుకే ఆపోహలు సృష్టిస్తున్నారని అన్నారు రాజగోపాల్ రెడ్డి. తాను పార్టీ మారతానన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. అమిత్ షాతో అలాంటివేం చర్చించలేదని తెలిపారు. ఇంతకుముందు కూడా ఆయన్ను చాలా సార్లు కలిశానని.. ఇప్పుడదేం కొత్త కాదని వివరించారు. తాను గతంలో బీజేపీకి అనుకూలంగా ప్రకటన చేసిన మాట వాస్తవమేనని.. కానీ, ఆపార్టీలో చేరిక గురించి ఎప్పుడూ ప్రకటన చేయలేదని గుర్తు చేశారు.
తనకు నిలకడ ఉంది కాబట్టే కాంగ్రెస్ లో ఉన్నానని హస్తం పార్టీ బాగుపడాలనే ఉద్దేశ్యంతోనే తాను కొన్ని మాటలు మాట్లాడినట్టుగా వివరించారు రాజగోపాల్ రెడ్డి. రాజీనామా చేయాలనుకోవడం లేదని తేల్చి చెప్పారు. మునుగోడు నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు, కేసీఆర్ అండ్ టీం చేస్తున్న అబద్దపు ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలు, అభిమానులను గందరగోళానికి గురిచేసే కుట్రలకు తెరలేపారన్నారు. తాను పార్టీ మారాల్సి వస్తే ప్రజలకు చెప్పే నిర్ణయం తీసుకొంటానని ప్రకటించారు. టీఆర్ఎస్ ఉసిగొల్పితే ఎన్నికలకు వెళ్లబోనని స్పష్టం చేశారు. ఏం చేసినా తన నియోజకవర్గ ప్రజలకు చెప్పే నిర్ణయం తీసుకొంటానన్నారు.
కేసీఆర్ కుటుంబ అవినీతి, కుటుంబ పాలనపై బహిరంగ యుద్ధ ప్రకటన చేద్దామని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. మునుగోడు నియోజకవర్గానికి ఒక్క పైసా కూడా కేటాయించని సీఎం.. నాయకులను కొనేందుకు రాత్రికి రాత్రే డబ్బు సంచులు రెడీ చేసుకున్నారని ఆరోపించారు. ముందు నుంచి డిమాండ్ చేస్తూ వస్తున్న డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో ప్రతిపాదించిన కిష్టరాయినిపల్లి భూ నిర్వాసితులకు మల్లన్నసాగర్ తరహాలో నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేటతో సమానంగా అన్ని విధాలుగా వెనకబడిపోయిన మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు ముందుకు వస్తే.. తాను ఏ త్యాగానికైనా సిద్ధమని సవాల్ చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానం తీసుకొన్న నిర్ణయాల వల్ల పార్టీ బలహీనపడిందని చెప్పారు రాజగోపాల్ రెడ్డి.
తాను పదవుల కోసం రాజకీయాలు చేసే వ్యక్తిని కాదంటూ ఆవేదన చెందారు. కాంగ్రెస్ అన్నా, సోనియా గాంధీ అన్నా తనకు అపారమైన అభిమానం ఉందని వెల్లడించారు. రాష్ట్ర అధిష్టానం తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా.. సోనియా గాంధీ మీద గౌరవంతోనే సైలెంట్ గా ఉన్నానని అన్నారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఏనాడూ వ్యవహరించలేదని, అధిష్టానం నిర్ణయాలనే విమర్శించానని తెలిపారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు ఇచ్చి, వారి నాయకత్వంలో పనిచేయాలంటే మనసు ఒప్పక మూడేళ్లు సైలెంట్ గా ఉన్నానని.. కానీ, కేసీఆర్ ను గద్దె దింపాల్సిన అవసరం వచ్చింది కాబట్టే ఇప్పుడు గొంతు విప్పుతున్నానని స్పష్టం చేశారు రాజగోపాల్ రెడ్డి.