నక్సలైట్ గా ఉన్నప్పుడూ.. లాయర్ అవుతా అనుకోలేదు.. లాయర్ గా ఉన్నప్పుడు ఎమ్మెల్యే అవుతా అనుకోలేదు… ఎమ్మెల్యేగా ఉన్నప్పుడూ డాక్టరేట్ సాధిస్తా అనుకోలేదు అంటున్నారు… ఎమ్మెల్యే సీతక్క.అవును కాంగ్రెస్ పార్టీ నేత, ములుగు ఎమ్మెల్యే ధనిసిరి అనసూయ అలియాస్ సీతక్క ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ సంపాదించారు.
సీతక్క సాధించిన డాక్టరేట్.. రాజకీయ నేతలు, ఆయా రంగాలకు చెందిన ప్రముఖులకు ఇచ్చే గౌరవ డాక్టరేట్ ఎంతమాత్రం కాదు. ఓ విద్యార్థిని మాదిరిగా పరిశోధన చేసి… ఆ పరిశోధనా పత్రాన్ని వర్సిటీకి సమర్పించి మరీ సీతక్క పీహెచ్‌డీ సంపాదించారు.
ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో గుత్తికోయ గిరిజనుల సామాజిక స్థితిగతులపై అధ్యయనం చేసిన సీతక్క.. ఆ అంశంపై పరిశోధనా పత్రాన్ని సమర్పించారు. పొలిటికల్ సైన్స్‌లో ఆమె పూర్తి చేసిన ఈ పరిశోధనకే ఆమెకు వర్సిటీ అధికారులు మంగళవారం పీహెచ్‌డీ పట్టాను అందించారు.
ఈ సందర్భంగా సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నక్సలైట్‌గా ఉన్నప్పుడు తాను లాయర్ అవుతాననుకోలేదని, లాయర్‌గా ఉన్నప్పుడు ఎమ్మెల్యే అవుతాననుకోలేదని, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పీహెచ్‌డీ సాధిస్తానని అనుకోలేదని ఆమె చెప్పుకొచ్చారు. ఇప్పుడు తనను డాక్టర్ సీతక్క అని పిలవొచ్చని కూడా ఆమె అన్నారు.
ప్రజలకు సేవ చేయడం, జ్ఞానాన్ని పొందడం తనకు అలవాటని సీతక్క చెప్పారు. తన చివరి శ్వాస వరకు ఈ రెండు లక్షణాలను ఆపపని తెలిపారు. ఓయూ మాజీ ఛాన్సలర్, ప్రస్తుతం మణిపూర్ వర్సిటీ ఛాన్సలర్‌గా పనిచేస్తున్న ప్రొఫెసర్ తిరుపతి రావు మార్గదర్శకత్వంలో సీతక్క తన పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఎమ్మెల్యేగా ఉంటూ పీహెచ్‌డీ సాధించిన సీతక్కకు సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది
In my childhood I never thought i would be a Naxalite, when I am Naxalite I never thought I would be a lawyer, when I am lawyer I never thought I would be MLA, when I am MLA I never thought I will pursue my PhD.
🔥Now you can call me Dr Anusuya Seethakka PhD in political science. pic.twitter.com/v8a6qPERDC— Danasari Anasuya (Seethakka) (@seethakkaMLA) October 11, 2022