కొంతకాలం క్రితం తొలివెలుగు ఓ కథనాన్ని ప్రచురించింది. వరంగల్-నల్గొండ-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ను బరిలోకి దించబోతున్నారని, అయితే… ఈ ఎంపిక టీఆరెఎస్ కు మేలు చేసేందుకు కాంగ్రెస్ ముఖ్య నేత డైరెక్షన్ లోనే ఇదంతా జరుగుతుందని ఆ కథనంలో వివరించింది.
వరంగల్-నల్గొండ-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం టీఆర్ఎస్ కు సిట్టింగ్. కానీ ఇప్పుడు అక్కడ గెలవటం అంత హిజీగా లేదు. ఓవైపు కోదండరాం, మరోవైపు మల్లన్న, వామపక్ష కూటమి నుండి జయసారథి, రాణిరుద్రమ వంటి బలమైన నేతలు రంగంలో ఉన్నారు. పైగా ఆరున్నర సంవత్సరాల టీఆర్ఎస్ పై అసంతృప్తి ఈసారి టీఆర్ఎస్ ఓటమికి దారితీస్తాయన్న టాక్ బలంగా ఉంది. పైగా కాంగ్రెస్ నుండి బెల్లయ్య నాయక్, మానవతారాయ్ వంటి నేతలు టికెట్ కోరారు. కానీ కాంగ్రెస్ ముఖ్యనేత పరోక్షంగా టీఆర్ఎస్ ను గెలిపించేందుకు రాములు నాయక్ కు టికెట్ ఇచ్చేలా వ్యవహరం నడిపారు.
రాములు నాయక్ గిరిజన నేతే అయినా స్థానికేతరుడు. లోకల్ గా పరిచయాలు అంతంతే. దీంతో కాంగ్రెస్ టికెట్ పై ఆయన పోటీ చేసిన పెద్దగా ఓట్లు పడవని… ఓరకంగా కాంగ్రెస్ పోటీ నుండి తప్పుకున్నట్లుగానే భావించాల్సిందేనన్న అభిప్రాయం ఉంది. ఈ స్థానంలో మానవతారాయ్, బెల్లయ్య నాయక్ లో ఎవరికో ఒకరికి టికెట్ ఇచ్చినా పరిస్థితి వేరుగా ఉండేది. కానీ ఇప్పుడు పార్టీ పోటీ నుండి తప్పించినట్లు అయ్యిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.