ఆంధ్రా వాళ్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ కమిషన్ లో ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడ్డ నవీన్ కుటుంబాన్ని జీవన్ రెడ్డి ఆదివారం పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిరుద్యోగ యువకుడు సూసైడ్ చేసుకోవడం బాధకరమన్నారు. ఉపాధి లేకపోవడం వల్లే నిరుద్యోగులు బలవన్మరణానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. పక్క రాష్ట్రంలో ప్రత్యేక చట్టం పెట్టి మరీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారన్నారు జీవన్ రెడ్డి. కానీ హైదరాబాద్ లో ఎంతో స్కోప్ ఉన్నా ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదన్నారు.
పేపర్ లీకేజీ వల్ల అనర్హులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని దుయ్యబట్టారు. ఆంధ్రా వాళ్లు తెలంగాణ పబ్లిక్ కమిషన్ లో ఉన్నారని, పబ్లిక్ కమిషన్ నిర్లక్ష్యం వల్లే పేపర్ లీకేజీ జరిగిందన్నారు. టీఎస్పీఎస్సీ స్వతంత్రంగా నడిచే సంస్థ అని.. దానితో మాకు సంబంధం లేదని మంత్రి కేటీఆర్ చెప్పడం అమానుషమన్నారు జీవన్ రెడ్డి. కల్వకుంట్ల కుటుంబ సభ్యులను, అనుచరులను పబ్లిక్ కమిషన్ లో నియమించారని ఆరోపించారు.
స్వతంత్రంగా నడిచే సంస్థ అయినప్పుడు, ప్రభుత్వానికి సంబంధం లేనప్పుడు, స్వయానా ముఖ్యమంత్రి శనివారం రివ్యూ ఎలా చేశారు? అని ప్రశ్నించారు జీవన్ రెడ్డి. లక్షల రూపాయలు తీసుకొని పేపర్ లీకేజీ చేశారని విమర్శించారు. పేపర్ లీకేజీని కేటీఆర్ సమర్థిస్తున్నాడని మండిపడ్డారు. పబ్లిక్ కమిషన్ సభ్యుల నియామకంలో ప్రభుత్వ పాత్ర ఉందా? లేదా? అనేది తేల్చి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేటీఆర్ ఇలాకాలో నిరుద్యోగ యువతకు ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు కల్పించే అర్హత మీకు లేదన్నారు.
ఒక్క నిరుద్యోగి కూడా ఉండకుండా కనీసం ప్రైవేటు రంగంలో ఉద్యోగం కల్పించాలన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి.. నాలుగు సంవత్సరాలు అయిందని గుర్తు చేశారు. కమిషన్ లో వాస్తవాలు బయటకి రావాలంటే సీబీఐ చొరవ తీసుకోవాలని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. చైర్మన్ జనార్థన్ రెడ్డి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని, సభ్యులను వెంటనే తొలగించాలన్నారు జీవన్ రెడ్డి.