హైదరాబాద్: కాళేశ్వరం జలాలు తెలంగాణ భూములను సస్యశ్యామలం చేస్తున్నాయని ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి. కేవలం కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టారని, ఇప్పటి వరకు కాళేశ్వరం నుంచి ఒక్క చుక్క కూడా రాలేదని మండిపడ్డారు. ప్రభుత్వం చెప్తున్న మిడ్ మానేరుకు వచ్చిన 15 టీఎంసీలు, లోయర్ మానేరు డ్యామ్‌కు వచ్చిన 5 టీఎంసీలు ఎల్లంపల్లి నుంచి వచ్చినవేనని, అందులో ప్రభుత్వం చెప్తున్నట్టు కాళేశ్వరం నీళ్లు లేవని స్పష్టం చేశారు. 6వ పంప్ సెట్ విజయవంతం అంటూ ప్రభుత్వం చెప్తున్నా దాని వల్ల ఉపయోగం లేదని, కాళేశ్వరం నుంచి నీళ్లు వృధాగా సముద్రం పాలయ్యాయని వివరించారు. కాళేశ్వరం పేరుతో సర్కార్ చేస్తున్న ఉపయోగం లేని పనుల కారణంగా కాంట్రాక్టర్ల జేబులు, ప్రభుత్వ పెద్దల జేబులు నిండుతున్నాయని, నామినేషన్ బేసిస్‌లో కేటాయించిన పనులను వెంటనే రద్దు చేయాలని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు.