రైతుల ఆవేదనను ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి. మంగళవారం జగిత్యాల జిల్లాలో తిప్పన్నపేట ఐకేపీ కేంద్రం వద్ద ధాన్యం కొనుగోళ్ల తీరును నిరసిస్తూ రైతులు ఆందోళన నిర్వహించారు.
అన్నదాతల ఆందోళనకు మద్దతుగా జీవన్ రెడ్డి కూడా ఐకేసీపీ కేంద్రం వద్ద రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రోహిణి కార్తె వేళవుతున్నా ఇంకా ధాన్యం కొనుగోళ్లు పూర్తి కాలేదని.. కేసీఆర్ కు కాలాలపై అవగాహన ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని జీవన్ రెడ్డి అన్నారు.
ఓ వైపు అకాల వర్షాలు, మరోవైపు కొనుగోళ్లలో జాప్యానికి తోడు.. తరుగు పేరుతో అన్నదాతలను నిలువునా దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ఒక రైతుకు చెందిన ధాన్యం 106 క్వింటాళ్లకు 6.90 కేజీలతో కోత విధించారని మండిపడ్డారు జీవన్ రెడ్డి.
ఇప్పటికే రైతు బంధు పేరుతో రైతులకు కల్పించిన రాయితీలు, సౌకర్యాలు దూరం చేశారని.. ఆపై కొనుగోళ్ల తీరుతో ఇబ్బందులకు గురి చేయవద్దని అన్నారు. అధికారులను కొనుగోళ్ల విషయం గురించి అడిగితే లారీలు ఇప్పుడే పంపిస్తామంటున్నారు కానీ పంపించడం లేదని మండిపడ్డారు జీవన్ రెడ్డి.