మహారాష్ట్రలో కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్సీపై దాడి జరిగింది. ఎమ్మెల్సీ ప్రద్న్య రాజీవ్ సతావ్ పై ఓ వ్యక్తి చేయి చేసుకున్నాడు. హింగోలి జిల్లాలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న సమయంలో ఓ వ్యక్తి(40) వచ్చి ఎమ్మెల్సీ చెంపపై గట్టి కొట్టాడు. దీంతో అతనిపై పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు.
దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. తన ప్రాణాలకు ముప్పు ఉన్నట్టు ఎమ్మెల్సీ తెలిపారు. మహిళా ప్రజాప్రతినిధులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. తనపై జరిగిన దాడిని ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా ఆమె అభివర్ణించారు.
గత ఏడాది నవంబర్‌లోనూ తనపై దాడి జరిగిందన్నారు. తాజాగా దాడి జరగడం ఇది రెండోసారి అని ఆమె పేర్కొన్నారు. తనకు మరింత భద్రత కల్పించాలని ఆమె కోరారు. తనపై దాడికి ఆ వ్యక్తిని ఎవరో పంపి వుంటారని తాను అనుమానిస్తున్నట్టు చెప్పారు.
ఈ దాడి వెనుక ఎలాంటి రాజకీయ కుట్ర లేదని తనకు పోలీసులు చెప్పారని అన్నారు. నిందితున్ని మహేంద్రగా గుర్తించామని పోలీసలు వెల్లడించారు. నిన్న రాత్రి అతన్ని అరెస్టు చేసినట్టు వెల్లడించారు. ఆ దాడి ఆ వ్యక్తే చేశారా లేదా అతనితో ఎవరైనా చేయించారా అనే కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.