భారత్ జోడో యాత్రలో విషాదం చోటు చేసుకుంది. లుథియానాలో ఈ రోజు ఉదయం పాదయాత్ర జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ ఎంపీ సంతోక్ సింగ్‌కు గుండె పోటు వచ్చింది. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన మార్గ మధ్యలోనే తుది శ్వాస విడిచినట్టు తెలుస్తోంది.
సంతోక్ సింగ్ మరణ వార్తను రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ ట్వీట్ చేశారు. విన్న రాహుల్ గాంధీ ఆ ఆస్పత్రికి వెళ్లారు. ఈ క్రమంలో యాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్టు తెలుస్తోంది. ఆయన మరణంపై కాంగ్రెస్ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.
సంతోక్ సింగ్ మరణంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సంతాపం వ్యక్తం చేశారు. సంతోక్ సింగ్ మరణ వార్త విని తాను షాక్ కు గురైనట్టు ఆయన పేర్కొన్నారు. ఆయన అకాల మరణం పార్టీకి తీరని లోటు అని ఆయన అన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
జలంధర్ ఎంపీ సంతోక్ సింగ్ ఈ రోజు ఉదయం భారత్ జోడో యాత్రలో అకస్మాత్తుగా గుండె పోటు రావడంతో మరణించారని కాంగ్రెస్ సీనియర్ నేత జై రాం రమేశ్ ట్వీట్ చేశారు. యాత్ర సమయంలో చిన్న పాటి మార్పులు ఉంటాయని పేర్కొన్నారు.