అగ్ని పథ్ పథకంపై ఆందోళనలు శుక్రవారం ఉద్రిక్తమయ్యాయి. పలు చోట్ల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలో అగ్నిపథ్ పై చర్చించేందుకు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలని రక్షణ శాఖపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ లేఖ రాశారు.
ఈ సమావేశానికి స్టాండింగ్ కమిటీ సభ్యులందరినీ ఆహ్వానించాలని ఆయన లేఖలో కోరారు. వీరితో పాటు రక్షణ రంగ నిపుణులను సమావేశానికి ఆహ్వానించాలని ఆయన కోరారు. ఈ పథకంపై యువతలో తీవ్ర ఆగ్రహం నెలకొందని ఆయన తెలిపారు.
ప్రధానంగా నాలుగేండ్ల పాటు తాత్కాలికంగా రిక్రూట్ చేసుకుంటుండంపై యువతలో ఆందోళన నెలకొందన్నారు. ఇందులో సైనికులకు పెన్షన్ లేకపోవడం, హెల్త్ బెనిఫిట్స్ లాంటివి లేకపోవడంపై యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోందన్నారు.
స్టాండింగ్ కమిటీ సభ్యులతో విస్తృత సంప్రదింపులు జరపకుండానే హడావుడిగా ఈ పథకాన్ని మోడీ సర్కార్ తీసుకువచ్చిందన్నారు. అందువల్ల అగ్నిపథ్ పథకంపై సవివరంగా చర్చించడానికి వీలైనంత త్వరగా స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని పిలవాలని కమిటీ చైర్మన్ జువ్వల్ ఓరమ్ ను ఆయన కోరారు.