తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మర్యాద కూడా తెలియదని విమర్శించారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి. తన నియోజకవర్గంలోని వాసాలమర్రిలో రెండు సార్లు సభ పెట్టి.. ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎంపీనైన తనకు కనీసం సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు. కేసీఆర్ సమావేశానికి పిలకవపోడమే మంచిదని.. ఆయన పక్కన కూర్చుంటే తన పరువే పోతుందని ఎద్దేవా చేశారు. నోరు తెరిస్తే ఆయన చెప్పే అబద్ధాలు వినలేమని అన్నారు. తెలంగాణ అంటే మర్యాదకు మారు పేరని.. అలాంటి రాష్ట్రంలో విపక్ష ప్రజాప్రతినిధులను గౌరవించకపోవడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పుకొచ్చారు.
రాష్ట్రంలో పీసీసీగా ఎవరు ఉన్నా.. సోనియా, రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ తెలంగాణలో విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు కోమటిరెడ్డి. చౌటుప్పల్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రెండేళ్ల క్రితం తనకు అపాయింట్‌మెంట్ ఇస్తానని చెప్పిన కేసీఆర్.. ఆ తర్వాత కోమటిరెడ్డికి చచ్చినా అపాయింట్‌మెంట్ ఇవ్వనని అన్నట్టు గుర్తు చేశారు.