తెలంగాణలో బీఆర్ఎస్-కాంగ్రెస్ పొత్తు ఉంటుందని అనలేదని అన్నారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. తెలంగాణలో ఎన్నికల తర్వాత హంగ్ వస్తుందని, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీతో కలవక తప్పదంటూ కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. అయితే నేను అలా అనలేదని.. నా వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని తెలిపారు కోమటిరెడ్డి. రాహుల్ గాంధీ చెప్పిందే తాను చెప్పానని అన్నారు. పార్టీలో చిన్న చిన్న నేతలు కూడా తనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు.
నా వ్యాఖ్యలను బీజేపీ నాయకులు రాజకీయం చేస్తున్నారు. రాష్ట్రంలో హంగ్ వస్తుందని, బీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు ఉంటుందని తాను అనలేదని స్పష్టం చేశారు. నేను తప్పు చేయలేదని, అనవసరంగా రాద్ధాంతం చేయొద్దని అన్నారు. హైదరాబాద్ – విజయవాడ హైవే గురించి మాట్లాడేందుకే గడ్కారీతో భేటీ అయ్యానని, ఇది అఫీషియల్ మీటింగ్ అన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
అయితే మంగళవారం ఉదయం తెలంగాణలో హంగ్ వస్తోందటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీ నాయకులతో పాటు ప్రత్యర్ధులు సైతం మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి వ్యాఖ్యలు రాద్ధాంతం అవుతుండడంతో ఆయన మరోసారి స్పందించారు.
ఇంతకీ వెంకట్ రెడ్డి ఏమన్నారంటే..
తెలంగాణలో పొత్తులపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంగళవారం ఉదయం సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ను పొగుడుతూ.. బీజేపీని తిడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ లు సెక్యులర్ పార్టీలని చెప్పారు. కేసీఆర్ కాంగ్రెస్ తో నడవక తప్పదన్నారు. రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో హంగ్ ఏర్పడుతుందన్నారు. ఒకవేళ హంగ్ ఏర్పడితే బీఆర్ఎస్ తమతో కలవాల్సిందేనని తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా 60 సీట్లు రావని జోస్యం చెప్పారు. తాము ఒంటిరిగా అధికారంలోకి రామని.. సీనియర్ నేతలు అందరూ కలిస్తే 40 నుంచి 50 సీట్లు వస్తాయన్నారు. మార్చి ఫస్ట్ వీక్ లో యాదగిరి గుట్ట నుంచి తన పాదయాత్ర మొదలు పెడతానని వివరించారు. రాష్ట్ర ఇన్ చార్జ్ గా మాణిక్ ఠాక్రే వచ్చాక పార్టీలో అంతా బాగుందని అన్నారు వెంకట్ రెడ్డి.