– సీఎం టూర్ ను అడ్డుకోవాలన్న రేవంత్
– పట్టించుకోని కోమటిరెడ్డి..!
– కేసీఆర్ ప్రోగ్రాంకు హాజరు.. పొగడ్తల వర్షం
– మనం మనం కొట్టుకోవద్దంటూ హితబోధ
– కోమటిరెడ్డి తీరుపై పార్టీలో చర్చ
తెలంగాణలో కాంగ్రెస్ ను గెలిపించాలని రేవంత్ రెడ్డి పడుతున్న శ్రమ అంతా.. ఏదో ఒక రూపంలో వేస్ట్ అవుతున్నట్లే అనిపిస్తోంది. ఇప్పటికే కొందరు సీనియర్లు తలనొప్పిగా తయారై.. పార్టీ పరువు తీస్తున్న పరిస్థితి. బహిరంగంగా విమర్శలు చేసి క్యాడర్ ను గందరగోళంలోకి నెడుతున్నారనేది తరచూ కనిపించే సీనే. అయితే.. రేవంత్ మాత్రం తన పంథాలో ముందుకు వెళ్తూ కార్యకర్తలకు బలాన్ని నూరిపోస్తున్నారు.
ప్రస్తుతం తెలంగాణ రాజకీయం మోడీ వ్యాఖ్యల చుట్టూ తిరుగుతోంది. రాష్ట్రానికి అవమానం.. మళ్లీ ఏపీ, తెలంగాణ కలిపేస్తారంటూ కేసీఆర్ సెంటిమెంట్ ను వర్కవుట్ చేస్తుంటే.. మోడీ క్షమాపణలు చెప్పాలని, కేసీఆర్ నోరు విప్పాలని నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తోంది కాంగ్రెస్. అటు.. ప్రధాని మాటల్లో తప్పేముందని అంటోంది బీజేపీ. మూడు పార్టీల మధ్య పోటాపోటీగా డైలాగ్ వార్ జరుగుతోంది. అయితే.. సీఎం జనగామ టూర్ ను అడ్డుకోవాలని రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
అధ్యక్షుడు ఏదైనా చెప్తే పార్టీలో ఉన్నవారు ఎవరైనా చేయాల్సిందే. కానీ.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీరు మరోసారి చర్చనీయాంశమైంది. కేసీఆర్ ప్రోగ్రాంకు హాజరైన ఆయన.. సీఎంను ఆకాశానికెత్తేశారు. 33 జిల్లాలు చేశారు.. పరిపాలన సౌలభ్యం.. కొన్ని రాష్ట్రాల్లో తెలంగాణ కలెక్టరేట్ల స్థాయిలో సచివాలయాలు లేవు.. ఆదాయం లేకున్నా రెండేళ్లుగా సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నారు అంటూ కేసీఆర్ పై పొగడ్తల వర్షం కురిపించారు. అంతేకాదు.. తెలంగాణ వచ్చింది.. ఇక మనం మనం మనం కొట్టుకోవద్దు.. పోరాటాలు, ఘర్షణలు వద్దు అంటూ హితబోధ చేశారు.
ఓవైపు తెలంగాణను అవమానించారని సీఎం ప్రోగ్రాంను అడ్డుకోవాలని పార్టీ అధ్యక్షుడు పిలుపునిస్తే.. ఇంకోవైపు అదేమీ పట్టించుకోకుండా వెళ్లి కేసీఆర్ ను పొగిడేసి వస్తారా? అంటూ కోమటిరెడ్డి తీరుపై కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ నడుస్తోంది. నిజానికి రేవంత్ అంటే మొదట్నుంచి కోమటిరెడ్డికి పడదనేది బహిరంగ రహస్యమే. పీసీసీ అధ్యక్ష పదవి విషయంలో ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. తర్వాత ఓ ప్రోగ్రాంలో కలిసి కనిపించారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఏ నిరసన కార్యక్రమం చేపట్టినా పక్కపక్కనే ఉంటున్నారు. అంతా సెట్ అయిందిలే అని పార్టీ శ్రేణులు భావిస్తున్న ఈ సమయంలో అధ్యక్షుడి పిలుపును పట్టించుకోకుండా సీఎం కార్యక్రమంలో కోమటిరెడ్డి పాల్గొనడం.. కేసీఆర్ ను పొగడడం చూసి విస్మయం వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు.