తెలుగు రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఎప్పుడో మరిచిపోయాయి. తెలంగాణలో టీఆర్ఎస్, ఏపీలో వైసీపీ.. మోదీ సర్కార్‌కు దాదాపుగా సామంతపు సర్కార్లుగానే పనిచేస్తున్నాయి. ప్రత్యేక హోదా మొదలు సాగుచట్టాల వరకు.. ఏపీకి ఎంత పెద్ద అన్యాయం జరిగినా కేంద్ర ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనలేని పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం ఉంది. ఇక హస్తినలో గాండ్రిస్తాం.. మోదీ మెడలు వంచుతాం అని వీర లెవల్లో డైలాగులు చెప్పే గులాబీ అధినేత.. ఢిల్లీకి వెళ్లి ఎప్పుడో గులాములైపోయారన్న అభిప్రాయం అందరిలోనూ ఉండనే ఉంది.
మొదటి నుంచి కేసుల భయంతో అటు ఏపీ సీఎం జగన్.. ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రానికి అవసరం వచ్చినప్పుడల్లా తమ విధేయతను చాటుకుంటూనే ఉన్నారు. మోదీ తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలకు బేషరతుగా తలూపుతున్నారు. పోరాటాలే ఊపిరిగా బతికిన తెలుగు నేల ఇప్పుడు.. హస్తినకు ఫక్తు బానిసగా మారిపోయిన దుస్థితి కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న, నిలదీస్తున్న గొంతు ఒక్కటే కనిపిస్తోంది. అయనే తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. అతిశయోక్తి అనిపించినా.. మోదీ విధానాలను, కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలపై గళమెత్తుతున్నది ముమ్మాటికీ ఆయనే.ఎవరూ ఊహించని విధంగా.. సాగు చట్టాలకు వ్యతిరేకంగా పాదయాత్ర చేసి రైతులని చైతన్యపరిచినా.. ఏపీ, తెలంగాణకు చెందిన ఏ రాజకీయ నేతా చేయని విధంగా హస్తిన వెళ్లి రైతు ఉద్యమానికి సంఘీభావం తెలిపేందుకైనా ఆయన ఒక్కరే ప్రయత్నించారు. ఇంకా చెప్పాలంటే సాహసమే చేశారు. ఎందుకంటే అందరు నేతల్లాగే రేవంత్ రెడ్డిపైనా కేసులు ఉన్నాయి. చాన్స్ దొరికితే జైలుకు పంపాలనుకునే శత్రవులు రాష్ట్రంలోనే కాదు కేంద్రంలోనూ ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి వాటికి ఏ మాత్రం భయపడకుండా ఇటు కేసీఆర్, అటు కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ హాట్ టాపిక్‌గా మారుతున్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులే మోదీ ఎదుట మోకరిల్లుతున్న సందర్భంలో రేవంత్ రెడ్డి చేస్తున్న పోరాటాన్ని రెండు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. రేవంత్ రెడ్డి ధైర్యాన్ని మెచ్చుకోలేక ఉండలేకపోతున్నారు.