ముఖ్యమంత్రికి ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో ఉందని, ఎన్సీఆర్బీ నివేదిక స్పష్టం చేసింది… తక్షణ చర్యలు డిమాండ్ చేస్తూ రేవంత్ లేఖ రాశారు.
రేవంత్ లేఖలో మరిన్ని అంశాలు…
సుమారు 12 గంటల పాటు జరిగిన కలెక్టర్ల సదస్సులో రాష్ట్రంలో రైతాంగ సమస్యల పై కనీస ప్రస్తావన చేయని మీ వైఖరి పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాను. అన్నదాతల బలవన్మరణాలు, వారి కష్టనష్టాల పై సమీక్షించేందుకు ఓ ఐదు నిముషాలైనా సమయం దొరకలేదా… లేక మనసురాలేదా!? 12 గంటల పాటు సాగిన సదస్సులో మీ ఊకదంపుడు ఉపన్యాసాలు, మాటల గారఢీలు తప్ప తీసుకున్న నిర్ణయాలు ఏమిటి? రైతుల సమస్యల గురించి ప్రస్తావిస్తే మీ హామీల ఉల్లంఘన, వైఫల్యాలు తేటతెల్లం అవుతాయని ఉద్ధేశపూర్వకంగానే విస్మరించినట్టు కనిపిస్తోంది. ఈ సదస్సులో మీ మాటల గారఢీతో మరోసారి తెలంగాణ సమాజాన్ని ఊహాలోకంలో విహరింపజేసే ప్రయత్నం చేశారు తప్ప ప్రజలకు ఒరిగింది శూన్యం. రాష్ట్రంలో రైతాంగ ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. వాటిపీ తక్షణ చర్యలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. ఈ లేఖ ద్వారా వాస్తవ పరిస్థితులు మీ దృష్టికి తీసుకువస్తున్నాను.
నేషనల్ క్రైం బ్యూరో రికార్డ్ (NCRB) తాజా లెక్కల ప్రకారం అన్నదాతల బలవన్మరణాలలో మన రాష్ట్రం దేశంలోనే మూడో స్థానంలో ఉంది. మహారాష్ట్ర, కర్నాటకలు మొదటి రెండు స్థానాలలో ఉన్నాయి. జనాభా నిష్ఫత్తి ప్రకారం ఆ రాష్ట్రలతో పోల్చుకుంటే మనం మొదటి స్థానంలో ఉన్నట్టే లెక్క. అంటే… రాష్ట్రంలోని రైతువర్గంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని అర్థమవుతోంది. గడచిన ఆరేళ్లలో తెలంగాణలో 5,912 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడినట్టు NCRB నివేదిక అధికారిక లెక్కలు చెబతున్నాయి. సగటున రోజుకు ముగ్గురు రైతుల బలవన్మరణాలకు పాల్పడటం తేలికగా తీసుకోవాల్సిన అంశం కాదు. అత్యంత సామాజిక రుగ్మతగా దాన్ని పరిగణించి తక్షణ చర్యలకు సిద్ధమవ్వాల్సిన అవసరం ఉంది. ఈ అధికారిక లెక్కలను చూస్తుంటే రైతుల విషయంలో మీరు చెబుతున్న మాటలన్నీ పచ్చి అబ్ధాలేనని స్పష్టమవుతోంది. తెలంగాణలో నీటిప్రాజెక్టులు కట్టేశాం, రైతుబంధు ఇచ్చేశాం… ప్రాజెక్టుల్లో జలకళ చూస్తుంటే కడుపు నిండిపోతోంది అంటూ మీరు చెబుతోన్న మాటలు ఒట్టి బూటకమని అర్థమవుతోంది.
READ ASLO : కాంగ్రెస్ ను మూసేద్దామా
మీ పాలనలో ఏడాదికి వెయ్యి మంది అన్నదాతలు బలవన్మరణానికి పాల్పడుతున్నారని లెక్కలు చెబతున్నాయి. రైతులకు మోసపూరిత హామీలు ఇచ్చి, వాటిని నెరవేర్చలేదు. అందువల్ల ఈ మరణాలకు మీరే బాధ్యులు. హామీలు నెరవేర్చకపోగా… రాష్ట్రం పచ్చగా కళకళలాడుతోందని పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. ఆరేళ్లుగా రైతుల విషయంలో మీ మోసం కొనసాగుతూనే ఉంది. తొలి దఫా అధికారంలోకి వచ్చినప్పుడు రూ.లక్ష రుణమాఫీ హామీని నాలుగు విడతలుగా మార్చి… చివరకు వడ్డీబారం కూడా మాఫీ కాని పరిస్థితి తీసుకువచ్చారు. రెండో దఫా అధికారంలోకి వచ్చి 14 నెలలైనా రూ.లక్ష రుణమాఫీ ఊసే లేదు. సాధారణ ఎన్నికలకు ముందు అట్టహాసంగా రైతుబంధు ప్రకటించారు. ఏరుదాటాక తెప్పతగలేసినట్టు ఇప్పుడు రెండు విడతలుగా రైతుబందు పెండింగ్ లో పెట్టారు. హజూర్ నగర్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం ఆ ఒక్క నియోజకవర్గంలో మాత్రం రైతుబంధు నిధులు విడుదల చేశారు. అంటే… ఎన్నికలు ఉంటే మాత్రమే మీ పథకాలు అమలవుతాయి లేదంటే, అటకెక్కుతాయని అర్థమవుతోంది.
రైతుబీమా సాకుతో ఆత్మహత్యలు చేసుకున్న రైతుకుటుంబాలకు ఇవ్వాల్సిన రూ.6 లక్షల ఆర్థిక సాయం పథకాన్ని ఇప్పటికే అటకెక్కించేశారు. మీ దృష్టిలో కౌలురైతులు అసలు రైతులే కాదు. వారికి ప్రభుత్వ పథకాలు అమలయ్యే సంగతి దేవుడెరుగు… అసలు వారిని గుర్తించేదే లేదని మీరు ప్రకటించడం అత్యంత దుర్మార్గం. బలవన్మరణాలకు పాల్పడుతోన్న వారిలో 80 శాతం కౌలురైతులే ఉన్న విషయం మీరు గుర్తించాలి.
కౌలురైతుల ప్రయోజనాలు కాపాడేందుకు 2011లో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాన్ని మీరు విస్మరించారు. ఆ చట్టప్రకారం కౌలురైతులకు గుర్తింపు కార్డులు జారీ చేయాల్సి ఉన్నా దురుద్ధేశంతోనే మీరు ఆ పని చేయడం లేదు. ఆ కార్డులు జారీ చేస్తే ప్రభుత్వ పథకాలన్నీ వారికి కూడా వర్తింపజేయాల్సి ఉంటుందన్న దుర్మార్గ ఆలోచన మీది.
మీ లక్కీ నెంబర్ ఆరు కనుక రైతులను కూడా మీరు ఆరు విషయాలలో మోసం చేశారు.
1. మొదటి దఫా అధికారంలోకి రాగానే ఏకమొత్తంగా చేయాల్సిన రూ.లక్ష రుణమాఫీని నాలుగు విడతలు చేసి వడ్డీభారం కూడా తీరని పరిస్థితి కల్పించారు.
2. రెండో దఫా అధికారంలోకి వచ్చి 14 నెలలైనా రూ.లక్ష రుణమాఫీ ఊసేలేదు.
3. కౌలురైతులకు పథకాల సంగతి దేవుడెరుగు… వారిని కనీసం రైతులుగా గుర్తించేందుకు మీకు మనసు రావడం లేదు.
4. ఎన్నికలు ఉంటే తప్ప రైతులకు రూపాయి సాయం చేయరని… రైతుబంధు పథకం అమలవుతోన్న తీరుతో అర్థమవుతోంది.
5. రైతుబీమా సాకుతో జీవో నెంబర్ 194 ప్రకారం బలవన్మరణాలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు ఇవ్వాల్సిన రూ.6 లక్షల పరిహారం పథకాన్ని ఎత్తేశారు.
6. పంటలకు గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పి మాటతప్పారు.
రైతులకు ఎన్నికల సందర్భంగా మీరు ఇచ్చిన హామీలన్నింటికీ ఈ బడ్జెట్ లోనే నిధులు కేటాయించాలి. అన్నదాతల ఆత్మహత్యల నివారణకు తక్షణ చర్యలకు సిద్ధం కావాలి. జీవో 194ను తక్షణం అమలు చేయాలి. ఈ జీవో కింద ఉన్న బకాయిలను వెంటనే ఆయా రైతు కుటుంబాలకు అందజేయాలి. ఈ డిమాడ్లపై సానుకూలంగా స్పందింనని పక్షంలో అతి త్వరలో రైతు సమాజాన్ని సంఘటితం చేసి మీ ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం కావాల్సి ఉంటుంది.
రేవంత్ రెడ్డి
ఎంపీ మల్కాజిగిరి