రేవంత్ రెడ్డి, లోక్ సభ సభ్యుడు – మల్కాజ్ గిరి
విషయం: కరోనా వైరస్ నేపథ్యంలో ఖైదీల ఆరోగ్య భద్రత గురించి…
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోన్న విషయం మనం చూస్తున్నాం. దాని భారిన పడకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రజలు ఒక దగ్గర గుమికూడకుండా జనతా కర్ఫ్యూ పాటించాం. ఇదే స్ఫూర్తితో మార్చి31 వరకు ప్రజలంతా ఇళ్లకే పరిమితం అవ్వాలని లాక్ డౌన్ ప్రకటించాం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జైళ్లలో ఖైదీలు వేల మంది ఒకే చోట నివశిస్తోన్న విషయాన్ని మీరు విస్మరించారు. ఉదాహరణకు ఒక్క చర్లపల్లి కేంద్ర కారాగారంలోనే సుమారు రెండు వేల మంది ఖైదీలు ఉన్నారు. సమూహంగా వారంతా ఒకే ప్రాంగణంలో ఉన్నారు. తీవ్ర నేరాలకు పాల్పడి, శిక్ష అనుభవిస్తోన్న వారితో పాటు… చిన్నపాటి నేరాలు చేసి విచారణ ఖైదీలుగా ఉన్నవారూ అక్కడ ఉన్నారు. వీళ్లకు తోడు జైలు సిబ్బంది మరో 200 మంది వరకు ఉన్నారు. సిబ్బంది నిత్యం నగరంలోకి వచ్చి, తిరిగి విధులకు వెళుతుంటారు. జైళ్లలో ఖైదీలు సమూహంగా ఉండటం ప్రమాదకరం అని భావించి ప్రపంచంలోని పలు దేశాలు తక్షణ చర్యలు మొదలు పెట్టాయి. అమెరికా, ఐర్లాండ్, యూకే, ఇరాన్ దేశాలు జైళ్లలో ఖైదీల సంఖ్యను తగ్గిస్తున్నాయి. ఆస్ట్రేలియాలో న్యాయవాదులు 370 మంది ఇదే అంశం పై అక్కడ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ దేశాలన్నీ ఖైదీలకు బెయిళ్లు ఇచ్చి పంపించే ప్రక్రియను మొదలు పెట్టాయి. మనం కూడా ఈ దిశగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మీరు తక్షణం జోక్యం చేసుకుని న్యాయవ్యవస్థతో సంప్రదింపులు జరపండి. ఇప్పటికే మన ఖైదీలు జైళ్లలో దుర్భర పరిస్థితులను అనుభవిస్తున్నారు. అక్కడ కనీస శానిటైజేషన్ ప్రక్రియ జరగడం లేదు. చర్లపల్లి జైల్లో రెండు వేల మంది ఖైదీలకు మందుల కోసం ఒక రోజుకు రూ.2,500 మాత్రమే కేటాయిస్తున్నారు. సగటున ఒక రోజుకు ఒక ఖైదీకి మందుల కోసం రూపాయి కూడా కేటాయించడం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వారు కూడా మన పౌరులే అన్న విషయాన్ని మర్చిపోవద్దు. వారికీ రాజ్యంగం కల్పించిన జీవించే హక్కు, మానవహక్కులు ఉంటాయన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాను. బాధ్యత కలిగిన ప్రభుత్వంగా వారి హక్కులను కాపాడాల్సిన బాధ్యత మీపై ఉంది. ఈ నేపథ్యంలో న్యాయ వ్యవస్థతో సంప్రదించి, ఖైదీలను బెయిలుపై విడుదల చేయించేందుకు తక్షణం చర్యలు తీసుకోండి. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించి… జరగరాని ఘటన జరిగితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే ముందు జాగ్రత్త మంచిది. ఎ. రేవంత్ రెడ్డి, లోక్ సభ సభ్యుడు – మల్కాజ్ గిరి