కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పాదయాత్రకు మొగ్గుచూపుతున్నారా…? పట్టణప్రగతి పేరుతో టీఆర్ఎస్ నాయకత్వం హడావిడికి రేవంత్ రెడ్డి చెక్ పెట్టబోతున్నారా…? పార్టీ పెద్దల నుండి ఇబ్బంది రాకుండా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నారా…?
తొలివెలుగు.కామ్‌కు అందుతోన్న సమాచారం ప్రకారం పై ప్రశ్నలకు అవుననే సమాధానమే వస్తోంది. అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉన్నా… రేవంత్ పాదయాత్రకు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే, గతంలో ఎన్నికల సమయంలో పాదయాత్రలంటే పార్టీ అధినాయకత్వంతో పాటు, రేవంత్ రెడ్డి అంటే గిట్టని నాయకుల విమర్శలు చూసిన తర్వాత… ఎవరికీ ఇబ్బంది లేకుండా, స్తబ్ధుగా ఉన్న కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తునట్లు తెలుస్తోంది.
సీఎం కేసీఆర్ పట్టణ ప్రగతి పేరుతో ఇటీవల గెలిచిన టీఆర్ఎస్ నేతలంతా ప్రజల్లో ఉండేలా వ్యూహాం ఖరారు చేసుకున్నారు. దీంతో పోటీగా ఎంపీ రేవంత్ రెడ్డి కూడా తన మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలో పాదయాత్ర చేయబోతున్నారు. బస్తీ బాట పేరుతో… మల్కాజ్‌గిరిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రతి వార్డు టచ్ అయ్యేలా బస్తీ బాట నిర్వహించబోతున్నారు.
ఏ బస్తీలో ఏయే సమస్యలున్నాయి, ఎన్ని నిధులు కావాలి, అత్యవసర సమస్యలేంటీ…? వచ్చేది ఎండాకాలం కాబట్టి తాగునీటి సమస్య ఎలా ఉంది…? కొత్తగా ఏర్పడిన మున్సిపల్ కార్పోరేషన్ల పరిధిలో సమస్యల పరిస్థితి ఏంటీ…? వంటి సామాన్య, మధ్య తరగతి ప్రజల సమస్యల పరిష్కారమే ఎజెండాగా రేవంత్ పర్యటన ఉండబోతుందని తొలివెలుగు.కామ్‌తో రేవంత్ రెడ్డి సన్నిహితవర్గం నేతలంటున్నారు.
పీసీసీ నుండి సరైన కార్యక్రమాలు లేకపోవటం, వరుస ఓటములతో చతికిలపడిన కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపినట్లవుతుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. జూబ్లిహిల్స్ పెద్దమ్మ గుడిలో ప్రత్యేక పూజల అనంతరం… రేవంత్ బస్తీ బాట ఉండబోతుంది.
అయితే, అధికారికంగా ఎప్పటి నుండి అనేది తెలియాల్సి ఉంది.