రాజ్యసభలో విచిత్ర ఉదంతం చోటు చేసుకుంది. సభా కార్యకలాపాలను తన మొబైల్ లో రికార్డ్ చేసిన కాంగ్రెస్ ఎంపీ రజనీ పాటిల్ ని చైర్మన్ జగదీప్ ధన్ కర్ సస్పెండ్ చేశారు. ఇది అత్యంత సీరియస్ విషయమని, ఆమె ఇందుకు పాల్పడి ఉండాల్సింది కాదని ఆయన తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు. పార్లమెంటరీ నిబంధనలను అతిక్రమించినందుకు గాను ఈ బడ్జెట్ సమావేశాలు ముగిసేంతవరకు ఆమెను సస్పెండ్ చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు.
నిన్న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా ప్రధాని మోడీ ప్రసంగిస్తుండగా విపక్ష సభ్యులు అడుగడుగునా ఆయనకు అడ్డు తగులుతూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.
ఈ సభకు సంబంధించిన ప్రొసీడింగ్స్ ని వీడియో రూపంలో రజనీ పాటిల్..రికార్డు చేయడం ఎంతయినా అనుచిత చర్య అని, తన దృష్టికి వచ్చిన ఈ ఉదంతాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నానని జగదీప్ ధన్ కర్ హెచ్చరించారు. . ఈ విధమైన చర్యలు పార్లమెంట్ పవిత్రతను మంట గలుపుతాయన్నారు.
ఆమె తీరుపై ప్రివిలేజ్ కమిటీ దర్యాప్తు చేయనుంది. ఆ కమిటీ తన నివేదికను సమర్పించేంతవరకు ఆమెను సస్పెండ్ చేస్తున్నట్టు పార్లమెంటరీ వర్గాలు తెలిపాయి. బడ్జెట్ సమావేశాలు ముగిసేంతవరకు రజనీ పాటిల్ సస్పెన్షన్ కు సంబంధించిన తీర్మానాన్ని సభ ఆమోదించింది. గతంలో ఎన్నడూ ఇలా జరిగిన దాఖలాలు లేవని ఈ వర్గాలు పేర్కొన్నాయి.