రాష్ట్రంలో స్థానిక సంస్థలు, గ్రామపంచాయతీల పట్ల రాష్ట్ర సర్కార్ నిర్లక్ష వైఖరిని ప్రదర్శిస్తోందని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నిధులను విడుదల చేసి గ్రామాభివృద్ధికి తోడ్పడాలని కోరారు. రాష్ట్రంలోని సర్పంచుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.
సర్పంచుల నిధుల సమస్యపై తమ పార్టీ చేపట్టిన దర్నాను అడ్డుకోవడం అన్యాయమని పేర్కొన్నారు. అరెస్టు చేసిన నేతలందరినీ వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీలకు 15వ ఫైనాన్స్ కమిషన్ ద్వారా కేంద్రం మంజూరు చేసిన రూ. 35 వేల కోట్ల నిధులను దొంగ చాటున వేరే అకౌంట్లకు బదిలీ చేసిందన్నారు.
గ్రామ పంచాయతీలకు జీత భత్యాలకు, మౌలిక సదుపాయాల కల్పనకు, అత్యవసరాల గురించి ప్రతి నెలా స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విడుదల చేయాల్సిన రూ 250 కోట్ల రూపాయలను 7 నెలలుగా నిలిపివేశారన్నారు. దీంతో గ్రామ పంచాయతీల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని పేర్కొన్నారు.
గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలంటూ సర్పంచులపై అధికారులు ఒత్తిడి చేస్తున్నారన్నారు. నిధులేకపోవడం, చేసిన పనులకు నిధులు రాకపోవడంతో సర్పంచులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. బిల్లులు పెండింగ్‌లో ఉండటం, చేతిలో పైసా లేకపోవడంతో చాలా మంది సర్పంచులు, ఉపసర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు.
ఇప్పటికే రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన సర్పంచులు, ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచులు చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని చెప్పారు. హామీలు అమలు చేయలేక, చేసిన పనులకు బిల్లులు రాక, గ్రామ పంచాయితీ ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేక చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు.
గ్రామాల్లో పనులు చేయాలని, లేని పక్షంలో సస్పెండ్ చేస్తామంటూ సర్పంచులను అధికారులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. చేసిన పనులకు బిల్లులు చెల్లించడం లేదని, వచ్చిన కొద్దిపాటి నిధులను ట్రాక్టర్ ఈఎంఐలకు కట్ చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో సర్పంచుల పరిస్థితి గందరగోళంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.