రోజురోజుకీ పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా కేంద్రంపై యుద్ధం కొనసాగిస్తూనే ఉంది కాంగ్రెస్. దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ రాహుల్ గాంధీతోపాటు ఇతర ఎంపీలు సైకిళ్లపై పార్లమెంట్ కు వెళ్లారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరముందని అన్నారు రాహుల్.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పటికే తెలంగాణలో ఆందోళనలు నిర్వహించింది రాష్ట్ర కాంగ్రెస్. ఇతర రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ నాయకులు కేంద్రానికి వ్యతిరేకంగా ధర్నాలు కొనసాగిస్తున్నారు.
మరోవైపు లోక్‌సభ, రాజ్యసభకు చెందిన విపక్ష పార్టీల నేతలు రాహుల్ గాంధీ ఇచ్చిన బ్రేక్ ఫాస్ట్ సమావేశానికి హాజరయ్యారు. కాంగ్రెస్ తోపాటు ఎన్సీపీ, శివసేన, తృణమూల్ కాంగ్రెస్, కేరళ కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా, ఆర్జేడీ, ఎస్పీ, సీపీఐ, సీపీఎం, ఆర్ఎస్‌పీ, నేషనల్ కాన్ఫరెన్స్, లోకతాంత్రిక్ జనతాదళ్ పార్టీలకు చెందిన ఫ్లోర్ లీడర్లు పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంపై అందరం కలిసి పోరాడదామని రాహుల్ వారిని కోరారు. ఈ భేటీ తర్వాత సైకిల్ పై పార్లమెంట్ కు వెళ్లారు రాహుల్ గాంధీ.