టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో సహా 10 మంది కాంగ్రెస్ నేతలు ఈ రోజు రాజ్ భవన్లో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ను కలిశారు. టీఎస్పీఎస్పీ లీకేజీ వ్యవహారంపై గవర్నర్ కు వారు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో గవర్నర్ తమిళి సై ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్టు కాంగ్రెస్ నేతలు వెల్లడించారు.
ప్రతిరోజు ప్రభుత్వం, ప్రతిపక్ష నేతలు చేసుకుంటున్న వ్యాఖ్యలను గమనిస్తున్నానని ఆమె చెప్పారని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి బాగా మాట్లాడుతారని, ఆయన వ్యాఖ్యలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నాని ఆమె చెప్పినట్టు వారు వెల్లడించారు.
టీఎస్పీఎస్సీ ఘటనపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను రేవంత్ రెడ్డి కోరారని చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 317, విభజన చట్టం సెక్షన్ 8 ప్రకారం గవర్నర్‌కు విచక్షణ అధికారాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారన్నారు. ఈ మేరకు ఓ లిఖిత పూర్వక ఫిర్యాదు ఇచ్చారన్నారు.
టీఎస్పీఎస్సీపై పూర్తి అధికారం గవర్నర్‌కు ఉంటుందని గతంలో సుప్రీం కోర్టు తీర్పులు ఇచ్చిందని, రాజ్యాంగం ప్రకారం ఆమెకు ఉన్న అధికారాలను ఉపయోగించుకోవాలని కోరినట్టు కాంగ్రెస్ నేతలు వివరించారన్నారు. లీకేజీ కేసులో ప్రభుత్వం పారదర్శకంగా విచారణ జరపడం లేదని కాంగ్రెస్ నేతలు అన్నారు.
దర్యాప్తు సరైన దిశలో నడిచేలా చూడాలని రేవంత్ రెడ్డి ఆమెను కోరినట్లు వెల్లడించారు. లీకేజీ వ్యవహారంపై రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు, దానిపై విచారణ తీరును కూడా గవర్నర్ కు వివరించారన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం చాలా పెద్దదని ఆమె వ్యాఖ్యానించినట్టు వారు చెప్పారు.
ఈ వ్యవహారంలో రోజు జరుగుతున్న పరిణామాలను తెలుసుకుంటున్నానని చెప్పారన్నారు. దీన్ని లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో ముడిపడిన అంశంగా పరిగణిస్తున్నట్లు ఆమె చెప్పారన్నారు. ఈ విషయంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి లీగల్ సెల్‌ను సంప్రదిస్తున్నానని, లక్షలాది మంది విద్యార్థులకు న్యాయం చేస్తానని వెల్లడించారన్నారు.
గవర్న్ ను కలిసిన అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్, ఛైర్మన్ జనార్ధన్‌రెడ్డి, అనితా రామచంద్రన్‌ను కూడా సిట్ విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. వెంటనే గవర్నర్ తన విచక్షణ అధికారాలను ఉపయోగించి ఛైర్మన్, కార్యదర్శి ఇంకా మిగిలిన సభ్యులను తొలగించాలని ఆయన కోరారు.
కేవలం ఇద్దరు వ్యక్తులనే దోషులుగా మంత్రి కేటీఆర్ చూపడం ఎంత వరకు సమంజసమన్నారు. ఈ విధంగా చూస్తే మిగిలిన సభ్యులను రక్షించేలాగా ఐటీ మంత్రి వైఖరి కనిపిస్తోందన్నారు. కచ్చితంగా ఇది ఐటీశాఖ పరిధిలోని వారే చేశారని ఆయన ఆరోపణలు గుప్పించారు.