కాంగ్రెస్ పార్టీ 85 వ ప్లీనరీలో పార్టీ సీనియర్ నేత శశిథరూర్ పార్టీ బలోపేతానికి పలు సూచనలు చేశారు. అనేక ప్రధాన సమస్యలపై పార్టీ స్పందించవలసి ఉందన్నారు. బిల్కిస్ బానో కేసు, క్రైస్తవుల చర్చిలపై దాడులు, గోసంరక్ష పేరిట జరుగుతున్న హత్యలు, ముస్లిముల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేతలవంటి పలు ఘటనలపై పార్టీ తీవ్రంగా స్పందించవలసి ఉందన్నారు. ఈ భారతీయ పౌరులే కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తారన్నారు.
2002 గోధ్రా ఘటన అనంతరం బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం కేసు దేశాన్ని కుదిపివేసిందని, అయితే ఈ కేసులో నిందితులైన 11 మంది దోషులు గత ఏడాది జైలు నుంచి విడుదలయ్యారని ఆయన చెప్పారు. ఈ వైనాన్ని మన పార్టీతో సహా అన్ని పార్టీలు ఖండించాయన్నారు. ఈ విధమైన కేసుల విషయంలో భారత బహుళార్థ వ్యవస్థ పరిరక్షణకు పార్టీ తన బాధ్యతగా కృషి చేయవలసి ఉందన్నారు.
కాంగ్రెస్ ‘కోర్’ మెసేజ్ కి ఇదే కేంద్ర బిందువవుతుందన్నారు. దేశ సెక్యులర్ పునాదిని బలోపేతం చేసేందుకు అన్ని ప్రయత్నాలు జరగాలని థరూర్ సూచించారు. భారత్ జోడో యాత్ర పార్టీ కేడర్ పై ప్రజల విశ్వాసాన్ని పెంచిందని చెప్పారు. పార్టీ ఆమోదించిన ఆర్ధిక తీర్మానం గురించి ఆయన ప్రస్తావిస్తూ.. ఈ ఆర్ధిక వృద్ధి ఫలాలు పేదలకు అందేలా చూడాల్సి ఉందన్నారు.
కాంగ్రెస్ ఫారిన్ పాలసీ లేదా బీజేపీ ఫారిన్ పాలసీ అంటూ ఏదీ లేదని, ఇండియన్ ఫారిన్ పాలసీ అన్నది మాత్రమే ఉందని శశిథరూర్ పేర్కొన్నారు. కానీ మోడీ ప్రభుత్వం దీన్ని పెడచెవిన పెట్టిందన్నారు. చైనా విషయంలో పార్లమెంటును ప్రభుత్వం విశ్వాసం లోకి తీసుకోవలసి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.