– హస్తం ఆశలు గల్లంతు
– ఐదు రాష్ట్రాల్లోనూ ఘోర పరాభవం
– జాతీయ పార్టీని పట్టించుకోని ప్రజలు
– పంజాబ్ లో అట్టడుగు స్థానాలకు..
– మిగిలిన రాష్ట్రాల్లోనూ అదే తీరు..!
ఐదు రాష్ట్రాల ఎన్నికలను అందరూ సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా చూశారు. కానీ.. వార్ వన్ సైడే అయింది. ఐదింట నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ తన హవాను కొనసాగించింది. అయితే.. కాంగ్రెస్ పరిస్థితే మరీ దారుణంగా తయారైందని అంటున్నారు విశ్లేషకులు. ముఖ్యంగా యూపీలో మరింత అధ్వాన్నంగా మారిందని చెబుతున్నారు.
ఇందిరా గాంధీ పోలికలు ఉండడంతో.. అదే గెటప్ తో ప్రియాంకాను రంగంలోకి దింపారు సోనియా. చాలా రోజుల ముందు నుంచే యూపీపై ప్రత్యేక దృష్టి పెట్టి తీవ్రంగా శ్రమించారు. యోగి సర్కార్ కు వ్యతిరేకంగా ప్రతీ చిన్న విషయాన్ని హైలైట్ చేస్తూ ప్రియాంక ముందుకు సాగారు. కానీ.. ఓటర్లు మాత్రం కాంగ్రెస్ ను నమ్మలేదు. ఆఖరికి ఆపార్టీ కంచుకోటగా చెప్పే రాయ్ బరేలీలోనూ కాంగ్రెస్ నేతలకు ఓటమి తప్పలేదు.
యూపీలో పరిస్థితి అలా ఉంటే.. పంజాబ్ లో మరింత ఘోరం. ఏకంగా అధికారాన్నే కోల్పోయింది. అట్టడుగు స్థానాలకు దిగజారిపోయింది. అక్కడ అంతర్గత కుమ్ములాటలతో పరువు పోగొట్టుకుంది హస్తం పార్టీ. చివరకు రెండు స్థానాల నుంచి పోటీ చేసిన ముఖ్యమంత్రి చన్నీ, పీసీసీ చీఫ్ సిద్దు సైతం ఓటమి రుచి చూడాల్సి వచ్చింది.
ఇక ఉత్తరాఖండ్ ఏర్పడినప్పటి నుంచి కాంగ్రెస్, బీజేపీ వంతులవారీగా గెలుస్తూ వస్తున్నాయి. రెండు పార్టీలను ఒక దాని తర్వాత ఒకటిగా గెలిపిస్తున్నారు ప్రజలు. ఈ లెక్కన ఈసారి కాంగ్రెస్ కే అధికారం దక్కాలి. కానీ.. ఓటర్లు హస్తం పార్టీని పట్టించుకోలేదు. మణిపూర్, గోవాలో బీజేపీ హవా కొనసాగడంతో కాంగ్రెస్ ప్రభావం చూపించలేకపోయింది.
కొద్దిరోజులు వెనక్కి వెళ్దాం…
గతేడాది బెంగాల్, కేరళ, అసోం, తమిళనాడు, పుదుచ్చేరికి ఎన్నికలు జరిగాయి. తమిళనాడులో మిత్రపక్షమైన డీఎంకే పుణ్యమా అని కాంగ్రెస్ కు పది సీట్లు దక్కాయి. అసోం, కేరళలో ఓటమి తప్పలేదు. బెంగాల్ లో సీపీఎంతో కలిసి పోటీ చేసినా ప్రయోజనం దక్కలేదు. ఇప్పుడు జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ పెద్దగా ప్రభావం చూపలేదు. దీంతో కాంగ్రెస్ పని అయిపోయిందనే విమర్శలు బీజేపీ వర్గాల నుంచి గట్టిగా వినిపిస్తున్నాయి.
నిన్నటిదాకా మిత్రపక్షాలతో కలిసి కాంగ్రెస్ ఏలుతున్న రాష్ట్రాలు కేవలం 6 ఉండేవి. అందులో రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, పంజాబ్ రాష్ట్రాలే కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి. మిగిలిన తమిళనాడు, జార్ఖండ్, మహారాష్ట్ర యూపీఏలో భాగస్వామ్యం. ఇప్పుడు పంజాబ్ చేజారిపోవడంతో రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ మాత్రమే మిగిలాయి. మిగిలిన మూడు భాగస్వామ్యం కాబట్టి ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి ఎంతటి కష్టం వచ్చిందని రాజకీయ పండితులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం హస్తం పార్టీ నాయకత్వ లోపంతో సతమతం అవుతోందని అంటున్నారు విశ్లేషకులు. దీనికితోడు సీనియర్ల గుంపుతో పార్టీకి నష్టం వాటిల్లుతోందని.. అదే క్రమంలో బీజేపీ మరింత బలం పుంజుకుని దూసుకెళ్తోందని అంచనా వేస్తున్నారు.