– వచ్చేది మా ప్రభుత్వమే
– సోనియా ఎవరి పేరు చెప్తే వారే సీఎం
– రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisements
సోషల్ మీడియాలో కాంగ్రెస్ నాయకులపై దుష్ప్రచారం చేస్తే వారిపై చర్యలు తప్పవన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. వచ్చే జూన్, జులైలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని.. అప్పుడు సోనియాగాంధీ ఎవరు ముఖ్యమంత్రి అని చెపితే వారిని పల్లకిలో మూసికెల్లి సీఎం కుర్చీలో కూర్చోబెడతామని స్పష్టం చేశారు. కేసీఆర్ పాలనలో దళితులకు డబుల్ బెడ్రూం ఇళ్లు, మూడెకరాల భూమి రాలేదని మండిపడ్డారు. గాంధీభవన్ లో బీజేపీ నేత ఎర్ర శేఖర్ కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రైతుల పాలిట శాపంలా మారిన ధరణి పోర్టల్ ను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేస్తుందని తెలిపారు. తెలంగాణలో దళితులు, గిరిజనులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
దళితులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భూముల్ని టీఆర్ఎస్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటోందని ఆరోపించారు రేవంత్. రైతు కమీషన్ ఏర్పాటు చేసి కాంగ్రెస్ అండగా ఉంటుందని చెప్పారు. ఇక మోడీ పాలనపైనా స్పందించిన రేవంత్.. రైతు చట్టాలు వెనక్కి తీసుకునేలా కాంగ్రెస్ పార్టీ అలుపెరగని పోరాటం చేసిందని గుర్తుచేశారు. అందుకే రాహుల్ పై కక్ష గట్టి మూసేసిన ఈడీ కేసును తిరగదోడుతోందని ఆరోపించారు.
రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ గా ఏడాది పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా గురువారం కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు జరిగాయి. ఎర్ర శేఖర్ తో పాటు దేవరకొండ నియోజకవర్గ నాయకులు బిల్యా నాయక్ సహా తదితరులు హస్తం గూటికి చేరారు. ఇటు ఇదే కార్యక్రమంలో ఏఐసీసీ శాశ్వత ఆహ్వానితుడిగా నియమితులైన మాజీ ఎంపీ టీ సుబ్బిరామిరెడ్డిని సన్మానించారు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు.
మరోవైపు ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి నేతృత్వంలో వంద మందికిపైగా అధికార పార్టీ నాయకులు కాంగ్రెస్ లో చేరారు. వారికి రేవంత్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. హస్తం పార్టీలో చేరిన వారిలో.. ఖైరతాబాద్, హిమాయత్‌న గర్, బంజారాహిల్స్, సోమాజిగూడ, వెంకటేశ్వర డివిజన్ల కమిటీలు, బస్తీ కమిటీలకు చెందిన వారున్నట్లు తెలిపారు. వారందరూ కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చినట్లు విజయారెడ్డి చెప్పారు.